కర్మభూమిగా, వేద భూమిగా, ఆచార సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా విలసిల్లే భారతదేశం అంటే పాశ్చాత్య దేశాలకు సైతం ఎనలేని గౌరవం.అక్కడి ప్రజలు మనకట్టు బొట్టు అంటే ముచ్చటపడతారు.
ఇక దీనికి తోడు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలసవెళ్లిన భారతీయులు క్రమేణా అక్కడి సమాజంలో కలిసిపోయారు.అలాగే మన పండుగలను, సంస్కృతిని అక్కడ కూడా పాటిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక విదేశీయులు కూడా పాల్గొంటూ భారతీయత గొప్పదనాన్ని తెలుసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన బ్రిటన్‌లో దీపావళి పండుగ కోసం ఐశ్వర్యానికి, సంపదకు ఆదిదేవత అయిన మహాలక్ష్మీ బొమ్మతో రాయల్ మింట్ 20 గ్రాముల బంగారు బిస్కెట్‌ని రూపొందించింది.
దీని అమ్మకాలు మంగళవారం నుంచి యూకేలో మొదలయ్యాయి.కార్డిఫ్‌లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ ఆలయం సహకారంతో రాయల్ మింట్ డిజైనర్ ఎమ్మా నోబుల్ ఈ గోల్డ్ బిస్కెట్‌ను డిజైన్ చేశారు.
సాంస్కృతిక వైవిధ్యానికి పట్టం కట్టే ఉద్దేశంతో సంప్రదాయానికి భంగం కలగని రీతిలో దీనిని తయారు చేసినట్టు రాయల్ మింట్ అధికారి ఆండ్రూ డిక్కీ తెలిపారు.
స్వామి నారాయణ్ ఆలయానికి చెందిన నీలేశ్ కబరియాతో కలిసి పనిచేయడం చాలా సంతోషమని చెప్పారు.
సౌందర్యం, సంప్రదాయానికి కొంత ఆధునికత జోడించి తయారు చేసిన మహాలక్ష్మీ గోల్డ్ బిస్కెట్ పండుగ సమయంలో ఆత్మీయులకు కానుకగా ఇచ్చుకునేందుకు బాగుంటుందనే ఉద్దేశంతో విడుదల చేశామని ఆండ్రూ వివరించారు.కాగా, ఒక్కో బంగారు బిస్కెట్‌ను 1,080 పౌండ్లకు విక్రయిస్తున్నారు.
ఆసక్తి వున్నవారు రాయల్ మింట్ వెబ్సైటులో దీనిని కొనుగోలు చేయవచ్చు.గత ఏడాది 1 గ్రాము, 5 గ్రాముల బిళ్లలను విడుదల చేయగా.
దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
నవంబర్ 4న రాయల్ మింట్ ప్రతినిధులు శ్రీ స్వామి నారాయణ దేవాలయంలో జరిగే లక్ష్మీపూజలో రాయల్ మింట్ ప్రతినిధులు హాజరుకానున్నారు.అమ్మవారి బొమ్మతో తయారైన గోల్డ్ బార్లను పూజలో వుంచి తర్వాత ప్రభుత్వానికి అందజేస్తామని ఆలయ ప్రతినిధి నీలేష్ కబరియా అన్నారు.హిందూ సంస్కృతిలో లక్ష్మీదేవి ప్రాముఖ్యతను రాయల్ మింట్ ప్రతినిధులు తెలుసుకున్నారని నీలేశ్ చెప్పారు.
వివాహాలు, పుట్టినరోజు వంటి ప్రత్యేకమైన సందర్భాలలో ఇచ్చిపుచ్చుకునే బహుమతులపై డిజైనర్ ఎమ్మా.ఐకానోగ్రఫీ ఉపయోగించారని ఆయన తెలిపారు.