సాధారణంగా మనం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి వారు మనకు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు.ఆంజనేయ స్వామిని ధైర్యానికి, బలానికి ప్రతీకగా భావిస్తాము.
రామాయణంలో ఆంజనేయుడు పాత్ర ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే.ఇక మనకు ఏవైనా పీడకలలు సంభవిస్తే వెంటనే మనం జపించే మంత్రం హనుమాన్ చాలీసా.
ఆంజనేయుడు ధైర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు.
ఇప్పటివరకు మనం కేవలం ఆంజనేయుడి దేవుడి రూపంలో దర్శనం ఇవ్వడం మాత్రమే చూసాము.
కానీ చత్తీస్ ఘర్ రాష్ట్రంలో రతన్ పూర్ జిల్లాలో గిర్జబంద్ లోని ఓ హనుమాన్ ఆలయం ఉంది.ఆలయంలో ఆంజనేయుడు మనకి దేవత రూపంలో దర్శనమిస్తాడు.దేవత రూపంలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామిని ఏ కోరిక కోరిన నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తుంటారు.ఆలయంలో స్వామి వారు తన భుజాలపై శ్రీరాముడు, సీతాదేవిని మోస్తున్నట్టుగా మనకు కనిపిస్తారు.
పురాణాల ప్రకారం దేవరాజ్ అనే రాజు ఉండేవాడు.అతను హనుమంతుడికి మిక్కిలి భక్తుడు.ఇదిలా ఉండగా ఆ రాజు కుష్టు రోగం బారిన పడుతాడు.దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించగా అతనికి కలలో స్వామివారు కనిపించి తనకు ఆలయం నిర్మించాలని చెబుతాడు.
దీంతో రాజు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన విరమించి స్వామి వారి ఆలయం నిర్మిస్తాడు.

ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు స్వామివారు మరోసారి రాజు కలలో కనిపించి మహామాయ కుండ్ వద్ద ఓ విగ్రహం ఉంటుందని, దానిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించాలని చెప్పి మాయమవుతాడు.కలలో స్వామి వారి చెప్పిన విధంగానే మరుసటి రోజు ఉదయం అక్కడికి వెళ్లి చూడగా అక్కడ స్త్రీ రూపంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం కనబడుతుంది.
ఈ విధంగా స్త్రీ రూపంలో ఉన్న ఆంజనేయుడి విగ్రహం తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించారు.
రాజు ఆలయంలో స్త్రీ రూపంలో ఉన్న ఆంజనేయుడి విగ్రహం ప్రతిష్టించి గానే రాజుకు ఉన్న రోగం నయమవుతుంది.ఈ విధంగా అప్పటి నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకుంటారు.