హెదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట ఓ గ్రామం.అక్కడన్నీ పంట పొలాలుండేవి.
ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతుండగా… అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది.చేతులేత్తి మొక్కి.
భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు.ఎంతకూ కదలకపోవడంతో ఊళ్లోకెళ్లి విషయం చెప్పాడు.
అమ్మవారిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు.తలో చేయి వేసి అమ్మవారిని ఒడ్డుకు చేర్చాలనుకుంటే కాస్తంతైనా కదలలేదు.
అమ్మవారు అక్కడే ఉండి పూజలందుకోవడమే అమ్మవారి అభీష్టమని శివసత్తులు తెలిపారు.దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనమెవరమనడంతో… మూలవిరాట్టును బావి లోపలే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేయడం ప్రారంభించారు.
ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది.దాతల సాయంతో అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు.
రాజా శివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో ‘బెహలూఖాన్ గూడా’ గా పిలువబడిన ఈ ప్రాంతం… తర్వాత కాలంలో బల్కంపేటగా మారిపోయింది.ఎల్లమ్మతల్లి ‘బల్కంపేట ఎల్లమ్మ’గా సుప్రసిద్ధురాలైంది.
నాటి నుంచి నేటి వరకు బల్కంపేట ఎల్లమ్మ భక్తుల కోరికలు తీరుస్తూ.చల్లని తల్లిగా పేరొందింది.
ప్రతి ఏటా ఆషాడ మాసంలో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మతల్లి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వమే అమ్మవారి కళ్యాణాన్ని జరిపిస్తోంది.
అంగరంగ వైభవంగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.