సాధించాలన్న కసి ఉంటే… ఎంతటి ఎత్తైనా అలవోకగా ఎక్కేస్తారు… ఇందుకు పేదరికం అడ్డురాదు, వయసు లెక్కకాదని నిరూపించారు తెలుగు చిన్నారులు.ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైనవి కిలిమంజారో పర్వతాలు… ఎంత ఎత్తంటే 19,341 అడుగుల ఎత్తు.
వాటిని అధిరోహించడమంటే మాటలు కాదు.పర్వతారోహణలో ఆరితేరిన వారికి సైతం అదో కఠిన పరీక్ష.
అలాంటి పర్వతాన్ని తెలుగు తేజాలు సునాయాసంగా ఎక్కేస్తున్నారు.వారం రోజులు వ్యవధిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చిన్నారులు కిలిమంజారోను అధిరోహించి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
సికింద్రాబాద్‌కు చెందిన తేలుకుంట్ల విరాట్ చంద్రకు ట్రెక్కింగ్ అంటే ఎంతో ఇష్టం .తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పర్వతారోహణ శిక్షకుడు భరత్ వద్ద ఈ బాలుడు శిక్షణ తీసుకున్నాడు.కోచ్, తండ్రి సహాయంతో ఈనెల 2వ తేదీన కిలిమంజారోను అధిరోహించే యాత్ర చేపట్టి… 6వ తేదీన తన గమ్యస్థానానికి చేరుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు.
ఇక కిలిమంజారో పర్వతంపై ఉండే గిల్మన్ పాయింట్‌ను చేరుకోవాలని పర్వతారోహకులు కలలు కంటారు.
కఠిన శ్రమతో కూడుకున్న ఆ ప్రయత్నంలో కొందరు మాత్రమే విజయం సాధించారు.ఇప్పుడు వారి జాబితాలో అనంతపూర్ జిల్లా యం.అగ్రహారంకు చెందిన తొమ్మిదేళ్ల రిత్విక శ్రీ చేరింది.కిలిమంజారో పర్వతం ఎక్కిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డుల్లోకెక్కింది.
గిల్మన్ పాయింట్ సముద్రమట్టానికి 5,681 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ఈ పాయింట్‌కు చేరుకున్న పర్వతారోహకులకు మాత్రమే అధికారికంగా సర్టిఫికెట్‌ను ప్రధానం చేస్తారు.
రిత్విక తండ్రి స్వతహాగా క్రికెట్ కోచ్, స్పోర్ట్స్ కంట్రిబ్యూటర్ కావడంతో ఆమెను బాగా ప్రొత్సహించారు.రిత్విక కిలిమంజారో అధిరోహించడంలోనూ ఆయన ఎంతగానో సహాయపడ్డారు.ఈ చిన్నారి తొలుత తెలంగాణలోని భువనగిరిలో ఉన్న రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో లెవెల్ 1 శిక్షణ తీసుకుంది.తరువాత లద్దాఖ్‌లో లెవెల్ 2 శిక్షణ తీసుకుంది.కఠోర సాధన ద్వారా మొదటి ప్రయత్నంలోనే కిలిమంజారోను అధిరోహించింది.ఆర్థిక ఇబ్బందుల కారణంగా పర్వతారోహణ చేయడం భారం అవుతుందని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడును సంప్రదించిన వెంటనే ఆయన ఆర్థిక సహాయం చేశారు.
భారతదేశం నుంచి బయల్దేరినప్పటి నుంచి ఎప్పటికప్పుడు వీరి పరిస్థితుల గురించి ఆరా తీశారు కలెక్టర్.అన్నట్లు ఈ పాప అనంతపూర్‌లోని సెయింట్ విన్సెంట్ డీ పౌల్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది.
కాగా, కిలిమంజారో పర్వతాన్ని 2006లో పదేళ్ల 11 రోజుల వయసులో కాలిఫోర్నియాకు చెందిన బాలిక జోర్డాన్ రొమెరో అధిరోహించింది.తద్వారా అతి చిన్న వయసులో ఆ పర్వతాన్ని అధిరోహించిన రికార్డు సొంతం చేసుకుంది.
ఆ తరువాత అక్టోబరు2, 2014లో హైదరాబాద్‌కి చెందిన ఒక ప్రైవేటు పాఠశాల విద్యార్థిని జాహ్నవి పన్నెండేళ్ల 11 నెలల వయసులో ఈ పర్వతాన్ని అధిరోహించింది.దీంతో ఆసియాలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సొంతం చేసుకుంది.
ఆ రికార్డులను తిరగరాసింది రిత్విక.కేవలం 9 ఏళ్ల పసిప్రాయంలోనే కిలిమంజారోను చేరుకుంది.