హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్ – కెనడా సంబంధాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే.దీనికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Prime Minister Justin Trudeau ) వైఖరే కారణం.
నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.ఆ తర్వాత కొద్దిరోజులు సైలెంట్ అయిన ట్రూడో.
మళ్లీ జోరు పెంచారు.నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Indian High Commissioner Sanjay Kumar Verma ) పేరును చేర్చి దుమారం రేపారు.
దీనిపై భగ్గుమన్న న్యూఢిల్లీ భారత దౌత్యవేత్తలను కెనడా నుంచి ఉపసంహరించింది.
ట్రూడో అండ చూసుకుని ఖలిస్తాన్ ( Khalistan )మద్ధతుదారులు రెచ్చిపోతున్నారు.కొద్దిరోజుల క్రితం బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌పై దాడికి తెగబడ్డారు.ఈ పరిణామాలతో కెనడాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రవాస భారతీయులు టెన్షన్ పడుతున్నారు.
అలాగే కెనడాలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వెళ్లాలని ప్లాన్ చేసుకున్న భారతీయులు కూడా డైలమాలో పడుతున్నారు.ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ‘స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ( Student Direct Stream )(ఎస్‌డీఎస్)ని నవంబర్ 8 నుంచి నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.
ఈ చర్య వేలాది మంది అంతర్జాతీయ విద్యార్ధులపై ముఖ్యంగా భారతీయ యువతపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2018లో ప్రారంభించబడిన ఎస్‌డీఎస్.నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న భారత్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ సహా 14 దేశాలకు చెందిన దరఖాస్తుదారుల కోసం స్టడీ పర్మిట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడింది.ఈ ప్రోగ్రామ్ కింద విద్యార్ధి వీసాల అనుమతి , జారీ, ఆమోదం వంటి ప్రక్రియలు వేగంగా జరుగుతాయి.
కెనడియన్ ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు సహా అన్ని స్థాయిలలో విద్యార్ధి వీసాలను 2025 నాటికి 4,37,000కు పరిమితం చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే స్టడీ పర్మిట్‌లపై రెండేళ్ల పరిమితి సహా ఈ సంఖ్యను 35 శాతం మేర తగ్గించింది.