కొన్ని జ్ఞాపకాలు మన మనసులో ఎంత బలంగా నాటుకు పోతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఉదాహరణకు, మన స్నేహితులు చేసే సరదా పనులు, సోదరులు చేసే చిన్న త్యాగాలు చాలా త్వరగా మనకు గుర్తుకు వస్తాయి.అదే విధంగా కాకుల జ్ఞాపక శక్తి (Memory power of crows)కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది.
ముఖ్యంగా ఇవి ఎవరైనా తమను బాధ పెడితే వారిని ఏకంగా 17 ఏళ్ల (17 years)వరకు గుర్తుంచుకుంటాయట! అంటే వాటి జ్ఞాపకశక్తి అంత ఎక్కువగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.కాకులు మనం అనుకున్నంత తెలివి తక్కువ పక్షులు కావు.
అవి చాలా తెలివైనవి.ముఖ్యంగా ఎవరైనా వాటికి ప్రమాదం కలిగిస్తే ఆ వ్యక్తిని గుర్తుంచుకునే విషయంలో అవి చాలా మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి.
ఒక పరిశోధన ప్రకారం, ఆకులు తమను బెదిరించిన వ్యక్తులను 17 సంవత్సరాల వరకు గుర్తుంచుకుంటాయి.సో, వాటితో పెట్టుకుంటే 17 ఏళ్లు నరకమే అని చెప్పుకోవచ్చు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇవి ఎవరైతే తమకు హాని తలపెట్టారు వారి గురించి తమ గుంపులోని ఇతర కాకులకు కూడా తెలియజేస్తాయి.అంటే, వాటికి ప్రమాదం కలిగించిన వ్యక్తి గురించి అన్ని కాకులకు హెచ్చరిక ఇస్తాయి.
దీని అర్థం కాకులు కేవలం నల్లటి రంగులో ఉన్న శబ్దం చేసే పక్షులు కావు.అవి చాలా తెలివైనవి, తమ సమూహాన్ని రక్షించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తాయి.
2006లో, వాషింగ్టన్ యూనివర్సిటీకి (University of Washington)చెందిన ప్రొఫెసర్ జాన్ మార్జ్‌లుఫ్(John Marzluff) అనే శాస్త్రవేత్త కాకుల గురించి ఒక ఆసక్తికరమైన అధ్యయనం చేశారు.ఆయన ఒక భయంకరమైన ముసుగు వేసుకుని కొన్ని కాకులను పట్టుకుని మళ్ళీ వదిలేశారు.ఆ కాకులకు గుర్తులు పెట్టి, ఆ తర్వాత కాలంలో మామూలు మాస్క్ వేసుకుని క్యాంపస్‌లో తిరుగుతూ కాకులకు ఆహారం కూడా ఇచ్చారు.కొద్ది రోజుల తర్వాత ఆశ్చర్యకరమైన విషయం జరిగింది.
మార్జ్‌లుఫ్ భయంకరమైన మాస్క్ వేసుకుని వెళ్ళినప్పుడు 53 కాకుల్లో 47 కాకులు ఆయనపై దాడి చేశాయి! అంటే ఆ కాకులు ఆయన ముఖాన్ని గుర్తుపెట్టుకుని, తమ సమూహానికి ప్రమాదం అని హెచ్చరిక ఇచ్చాయన్నమాట.ఈ అధ్యయనం ద్వారా కాకులకు మానవుల మాదిరిగానే జ్ఞాపకశక్తి ఉందని, ముఖాలను గుర్తుపెట్టుకుని తమ సమూహాన్ని రక్షించుకునే తెలివితేటలు ఉన్నాయని తెలిసింది.
2013లో, ప్రొఫెసర్ మార్జ్‌లుఫ్(Professor Marzluff) భయంకరమైన మాస్క్ వేసుకున్నప్పుడు కాకులు ఎక్కువగా కోపగించుకున్నాయి.కానీ కాలక్రమంలో వాటి కోపం నెమ్మదిగా తగ్గిపోయింది.ఈ ప్రయోగం మొదలైన 17 సంవత్సరాల తర్వాత, అంటే 2023 నాటికి, ఎలాంటి కాకి కూడా ఆ ముసుగును చూసి కోపగించలేదు.మార్జ్‌లుఫ్ జట్టు మరొక సాధారణ ముసుగును కూడా ఉపయోగించారు.
అది అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ ముఖం లాగా ఉండేది.కాకులు ఆ మాస్క్ వేసుకున్న వారిపై ఎప్పుడూ కోపగించుకోలేదు.
ఎందుకంటే వారికి ఆహారం ఇచ్చేది ఆ ముసుగు వేసుకున్న వారే కాబట్టి, వారిని ప్రమాదం లేని వారిగా గుర్తుంచుకున్నాయి.