అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజుల క్రితం భారతదేశంలోని కరోనా మరణాల గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.భారత్ కరోనా మరణాలను తక్కువ చేసి చూపుతోందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాజాగా మరోమారు ట్రంప్ భారతదేశంపై నోరు పారేసుకున్నారు.వాయు కాలుష్యం గురించి మాట్లాడుతూ చైనా, రష్యా దేశాలతో పాటు ట్రంప్ భారతదేశంపై కూడా విమర్శలు చేశారు.
వాయు కాలుష్యం విషయంలో అమెరికా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని ట్రంప్ అన్నారు. ఉత్తర కరోలినా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అక్కడికి వేల సంఖ్యలో హాజరైన అభిమానులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ అమెరికా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ శక్తివనరుల విషయంలో స్వయం సమృద్ధి సాధించిందని వెల్లడించారు.
పర్యావరణ గణాంకాలను పరిశీలిస్తే ఎల్లప్పుడూ అమెరికా అత్యుత్తమం అని వ్యాఖ్యానించారు.
రష్యా, చైనా, భారత్ గాలిలో హానికర పదార్థాలను విడుదల చేస్తున్నాయని.ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరగడానికి ఈ దేశాలు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.
ప్లాస్టిక్ కు బదులుగా కాగితాన్ని వినియోగించాలనే ఆలోచన సరైన ఆలోచన కాదని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
ట్రంప్ జో బిడెన్ వలస విధానం గురించి కూడా మాట్లాడుతూ ఘ్బాటు వ్యాఖ్యలు చేశారు.
అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తానని జో బిడెన్ చేసిన ప్రకటన అమెరికా హద్దులనే చెరిపేసే విధంగా ఉందంటూ ట్రంప్ పేర్కొనడం గమనార్హం.త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతదేశానికి వ్యతిరేకంగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఆయనకు నష్టం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు సర్వేల ఫలితాలు సైతం ట్రంప్ కు వ్యతిరేకంగానే ఉన్నాయి.ఇలాంటి తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ట్రంప్ తనపై వ్యతిరేకతను అంతకంతకూ పెంచుకుంటున్నారని ప్రవాస భారతీయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.