ప్రపంచ దేశాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా మహమ్మారి.రోజు రోజుకి దీని ప్రభావం కారణంగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
కరోనా రోగులకి వైద్య సేవలు అందిస్తున్న ఎంతో మంది వైద్యులు, నర్సులు, సిబ్బందికి కరోనా సోకడంతో వారు కూడా రోగులుగా మారిపోతున్నారు.దాంతో ప్రపంచ వ్యాప్తంగా వందల సంఖ్యలో వైద్యులు చనిపోతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇదిలాఉంటే వివిధ దేశాలలో ఎంతో మంది భారత సంతతి వైద్యులు, నిపుణులు కరోనా బాధితులకి సేవలు అందిస్తూ కరోనా బారిన పడి మృతి చెందుతున్న సంఘటనలు ఎన్నో నమోదు అవుతున్నాయి.ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి మృతి చెందిన భారత సంతతి వైద్యుల సంఖ్య 100 కి పైమాంటేనని అంచనా.
ఈ క్రమంలోనే తాజాగా బ్రిటన్ లో భారత సంతతి వైద్యురాలు మృతి చెందిన సంఘటన అందరిని కలిచి వేస్తోంది.
బ్రిటన్ లో కరోనా మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో అత్యంత ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొంది మన్ననలు అందుకున్న భారత సంతతి వైద్యురాలు కేరళాకి చెందిన పూర్ణిమా నాయర్ మృతి అక్కడి వైద్య లోకాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.పూర్ణిమా నాయర్ బ్రిటన్ లో బిషప్ ఆక్లాండ్ లోని స్టేషన్ వ్యూ మెడికల్ సెంటర్ లో కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు.కొంత కాలంగా కరోనా రోగులకి సేవలు చేస్తున్న ఆమెకి కూడా కరోనా సోకడంతో వైద్య సేవలు పొందుతూ నిన్నటి రోజున తుది శ్వాస విడిచారు.
ఆమె మరణంతో మేము అందరూ ఎంతో షాక్ కి గురయ్యామని మెడికల్ సెంటర్ ప్రకటించింది.ఆక్లాండ్ ఎంపీ, పలువురు భారత సంతతి ప్రజలు ఆమెకి సంతాపం తెలిపారు.