కాంగ్రెస్ మార్క్ రాజకీయాలంటే ఎలా ఉంటాయో ఇప్పుడిప్పుడే ఆ పార్టీ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డికి తెలిసొస్తున్నట్టు కనిపిస్తోంది.తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతున్న దశలో ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి అప్పట్లో మంచి ప్రాధాన్యమే కల్పించారు.
కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు ఆయన డిమాండ్లన్నిటికి ఒకే చెప్పింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హెలికాఫ్టర్ సౌకర్యం కూడా కల్పించి రేవంత్ ను రాష్ట్రమంతా ప్రచారానికి దింపారు.
ఒక దశలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా కూడా ప్రచారం జరిగింది.అయితే దీనిపై అప్పటి నుంచే కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉంటూ వస్తున్నారు.
కానీ అనూహ్యంగా తెలంగాణాలో కాంగ్రెస్ తో పాటు రేవంత్ కూడా ఓటమి పాలవ్వడంతో రేవంత్ హవా తగ్గింది.అయినా ఆయన ఎంపీగా గెలిచి తన సత్తా చాటుకున్నారు.
కానీ గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరయినా కాంగ్రెస్ లో రేవంత్ ప్రస్తుతానికి ఒంటరి పోరాటమే చేస్తున్నట్టు కనిపిస్తోంది.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారయ్యింది.
చెప్పుకోవడానికి జాతీయ పార్టీ అయినా ఉనికి కోసం పోరాడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో పార్టీలో మిగిలి ఉన్న నాయకులంతా ఐక్యతగా పార్టీని ముందుకు నడిపించాల్సి ఉన్నా వారు మాత్రం పంతాలకు పట్టింపులకు వెళ్లి పార్టీ పరువుని కాస్తా బజారున పడేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు.ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ సీనియర్ నాయకులు సాగిస్తున్న పోరు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ కుర్చీ కోసం వర్గ పోరు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది.ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తప్పించి తమకి అవకాశం కల్పించాలని అనేకమంది సీనియర్ నాయకులు డిమాండ్లు వినిపిస్తున్నారు.
ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నాయకులు ఉత్తమ్ ని వ్యతిరేకిస్తూ బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు.కోమటిరెడ్డి మాత్రమే కాదు.పలువురు సీనియర్లు పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ని వ్యతిరేకించారు.వీరంతా పీసీసీ కుర్చీపై కన్నేసినవారే.
అయితే అకస్మాత్తుగా వారంతా ఏకమయిపోయారు.ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ గా మారిపోయారు.
దీనంతటికి కారణం రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపమే కారణంగా కనిపిస్తోంది.
హుజుర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి, యురేనియం తదితర అంశాల్లో వీరంతా రేవంత్ ను టార్గెట్ చేసుకున్నారు.ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో రేవంత్ కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదా అనుమానాలు అందరిలోనూ బయలుదేరాయి.ప్రస్తుతం పార్టీ సీనియర్లంతా ఏకమవ్వడం, రేవంత్ రెడ్డి ఒంటరవ్వడంతో అధిష్టానం కూడా చేతులెత్తిసినట్టు కనిపిస్తోంది.
ఒక్కడి కోసం అందర్నీ వదులుకోలేదు, అలా అని రేవంత్ ని కూడా వదులుకోవడానికి ఇష్టపడమూ లేదు.ఇటువంటి పరిస్థితిల్లో పార్టీలో ఉండి అవమానాలు దిగమింగేకంటే తన రాకకోసం ఎప్పటి నుంచో ఎదురుచూపులు చూస్తున్న బీజేపీతో కలిసి ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుకి కూడా ఎటువంటి ఢోకా ఉండదు అనే ఆలోచనకు రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది.
దీనిపై తన సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
.