ఏపీలో నిన్నటి వరకు ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగింది.విపక్ష వైసీపీ నుంచి ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 23 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు.
వీరితో పాటు ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయితే పార్టీ మారడంలో కోకొల్లులుగా ఉన్నారు.అయితే ఇప్పటి వరకు అభివృద్ధి పనులో, అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్లో పార్టీ మారిన విపక్ష నేతలు ఉండొచ్చు… ఇప్పుడు ఎన్నికల వేడి స్టార్ట్ అయ్యింది.
అధికార పార్టీలో టిక్కెట్లు రాని నేతల పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించుకుంటే ఇప్పుడు వాళ్లకు వైసీపీయే పెద్ద ఆప్షన్.
ఏపీలో ఇప్పటికే రివర్స్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది.
టీడీపీలో టిక్కెట్లు రావని డిసైడ్ అయిన వాళ్ల టిక్కెట్ల హామీతో సైకిల్ ఎక్కేసే ప్రక్రియ జరుగుతోంది.కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి విజయవాడ తూర్పు సీటు హామీతో జగన్ చెంతకు చేరుతున్నారు.
ఇక అదే జిల్లాకు చెందిన మరో టీడీపీ కీలక నేత వసంత కృష్ణప్రసాద్ విజయవాడ ఎంపీ లేదా మైలవరం అసెంబ్లీ సీటు హామీతో వైసీపీ కండువా కప్పుకుంటారని టాక్.
ఇక గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు సైతం టీడీపీలో టిక్కెట్ రాదని తేలిపోవడంతో జగన్ గూటికి చేరుకునేందుకు టిక్కెట్ హామీ కోసం వెయిట్ చేస్తున్నారట.ఇక ఇప్పుడు అదే కోవలో ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీ రూట్లోనే ఉన్నట్టు వస్తోన్న వార్తలు ఏపీ రాజకీయాన్ని మరింత హీటెక్కించేస్తున్నాయి.కొండపి ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజనేయస్వామికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ రాదని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.
నియోజకవర్గంలో ఆయనపై ఉన్న వ్యతిరేకతకు తోడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌తో ఆయనకు ఉన్న విబేధాల నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ రాదన్న ప్రచారం మొదలైంది.జిల్లాలో ఇప్పుడు జనార్థన్ మాట చంద్రబాబుకు వేదవాక్కు.
బలరాం లాంటి వాళ్ల మాట కూడా చెల్లుబాటు కాని పరిస్థితి.ఈ క్రమంలోనే బలరాం సొంత నియోజకవర్గం అయిన కొండపిలో జూపూడి ప్రభాకర్‌రావు లేదా మరో వ్యక్తికి టీడీపీ సీటు వస్తుందంటున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల స్వామి వైసీపీ నాయకుడు, ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డితో సీక్రెట్‌గా మీట్ అయ్యి వైసీపీ సీటు ఇస్తానంటే పార్టీ మారిపోతానని చర్చలు జరిపినట్టుగా కూడా జిల్లాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న స్వామి వైసీపీలోకి వెళితే అది పెద్ద సంచలనమే అవుతుంది.అయితే ఎన్నికల నాటికి ఈ వలసలు మరింతగా ఉండనున్నాయి.