నంద్యాల ఉప ఎన్నిక ముగిసింది.ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది.
ఈ వార్‌లో ఓటరు టీడీపీకి షాక్ ఇస్తాడా ? వైసీపీకి షాక్ ఇస్తాడా ? అన్నది ఒక్కటే తేలాల్సి ఉంది.ఈ నెల 28న కౌంటింగ్ జరగనుంది.
నెల రోజులుగా హోరెత్తిన ప్రచారం తర్వాత బుధవారం ఉదయం నుంచే బారులు.హల్ చల్.ఓటర్లలో ఎక్కడలేని ఉత్సాహం కనపడింది.సాధారణ ఎన్నికల్లో 72 శాతం ఓట్లు పోలయితే ఈ ఉప ఎన్నికలో ఏకంగా 80 శాతం ఓట్లు పోలయ్యాయి
ఎక్కడైనా ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతుంది.
కానీ ఇక్కడ ఏకంగా 7 శాతం పెరిగింది.ఉప ఎన్నికలు అంటే సాధారణంగా ఎవరైనా ఓటు వేసేందుకు ఆసక్తి చూపరు.కాని నంద్యాల ఓటరు మాత్రం అందుకు భిన్నంగా భారీ ఎత్తున తరలివచ్చి మరీ ఓటు వేశాడు.ఈ అసాధారణ ఓటింగ్ ఎవరికి అనుకూలం ? ఎవరికి ప్రతికూలం అన్నదే ఇప్పుడు ఎవ్వరికి అంతుపట్టడం లేదు
మహిళలు, వృద్ధులు, యువకులు పెద్దయెత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో రెండు పార్టీలూ ఎవరికి వారు తమకే లాభమని చెబుతున్నాయి.నంద్యాలలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
మహిళా ఓటర్లు దాదాపు 1.11 లక్షల మంది ఉన్నారు.వృద్ధాప్య ఫించన్లు, భూమా దంపతుల సెంటిమెంట్ బాగా పనిచేసినందునే మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమకు ఓటేశారని టీడీపీ భావిస్తోంది
వైసీపీ నేతలు మాత్రం రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక కావడంతో అధికార పార్టీపై యువత తిరగబడి తమకే సపోర్ట్ చేస్తారని చెపుతున్నారు.
మహిళలు కూడా డ్వాక్వా గ్రూపుల రుణమాఫీపై ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిండం కూడా తమకే కలిసి వస్తుందంటున్నారు.నియోజకవర్గంలో 35 వేలు ఉన్న యువత కూడా తమకే ఓటు వేశారని, తాము యువత నాడిపట్టి చూశామని చెపుతున్నారు
ఇక కులాల వారీగా చూస్తే ముస్లిం, బలిజ, బ్రాహ్మణ, వైశ్య కులాల ఓట్లపై రెండు పార్టీలూ ఎవరికి వారే తమకు అనుకూలంగా పడతాయని చెబుతున్నారు.
మొత్తం మీద పోలింగ్ శాతం పెరగడం వల్ల తమకే లాభమంటూ రెండు పార్టీల నేతలూ చెప్పుకుంటున్నారు.ఇక పోలింగ్‌కు ముందు రోజు వరకు భారీ మెజార్టీ ధీమాతో ఉన్న టీడీపీ పోలింగ్ రోజు మెజార్టీ తగ్గుతుందని చెపుతుంటే వైసీపీ మాత్రం పోలింగ్ రోజు పుంజుకున్నామంటోంది.
మరి నంద్యాల ఓటరు భూమా ఫ్యామిలీపై కరుణ చూపాడా ? లేదా బాబు సర్కార్‌పై కసితో వైసీపీకి ఓటు గుద్దేశాడా ? అన్నది ఈ నెల 28న తేలనుంది.