బీఆర్ఎస్ కు చెందిన ఓ నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడం బీఆర్ఎస్ లో పెద్ద సంచలనంగా మారింది.అయితే ఈ భేటీ వెనుక పార్టీ మారే ఆలోచన లేదని, నియోజకవర్గాల అభివృద్ధి విషయమై రేవంత్ రెడ్డి( revanth reddy )తో భేటీ అయినట్లుగా ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చినా వారిపై మాత్రం అనుమానాలు పోవడం లేదు.
నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి , దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి , పఠాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ,జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు తదితరులు రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు.దీని కోసం కొత్త ప్రభాకర్ రెడ్డి( Kotha Prabhakar Reddy ) రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోగా, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయనతో వెళ్లి రేవంత్ ను కలిశారు.
మర్యాదపూర్వకంగానే రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యామని, వీరంతా వివరణ ఇచ్చినప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది.
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల పై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయిస్తోంది.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవినీతి వ్యవహారాలు చోటుచేసుకున్నాయని, వాటన్నిటినీ బయటకు తీసి అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పదే పదే స్టేట్మెంట్లు ఇస్తుండగా, ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డిని నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం రాజకీయంగా తమకు ఇబ్బంది అని బీఆర్ఎస్ భావిస్తోంది.
అసలు ఈ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్( Congress ) లో చేరేందుకే రేవంత్ రెడ్డిని కలిశారనే ప్రచారం కూడా జరుగుతుండడంతో, బీఆర్ఎస్ లో ఈ వ్యవహారం గందరగోళంగా మారింది.సునీత లక్ష్మారెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ లోనే ఉండడంతో ఆమెపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే వాస్తవంగా రేవంత్ రెడ్డితో ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎటువంటి చర్చలు జరపలేదు.
కాంగ్రెస్ లో చేరాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించలేదు.అయినా ఈ భేటీ రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది.