టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను పరిశీలించారు.కాలేజీ లోపల వెలుపల కలియతిరిగి పనులు ఎలా జరుగుతున్నాయో స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు సిబ్బందితో స్వయంగా మాట్లాడారు.వచ్చే ఆగస్టు సెప్టెంబర్ నాటికి కళాశాల అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రెండు నెలల్లో కాలేజీ ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ కు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కు విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని తాను చాలా ఏళ్లుగా కోరుతున్నట్లు జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు.మెడికల్ కళాశాల ప్రారంభమైతే సంగారెడ్డి పట్టణంతోపాటు జిల్లాలోని నలుమూలల ప్రజలకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు.
గాంధీ, ఉస్మానియా అస్పత్రుల తర్వాత సంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీ – జిల్లా ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుతాయని ఆకాంక్షించారు.అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తుండడం… జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఎలాంటి రోగం వచ్చినా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే అవసరం లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే సేవలు అందుతాయని జగ్గారెడ్డి అన్నారు.సంగారెడ్డి మెడికల్ కాలేజీ- జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల తో పాటు సహాయకులకు షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని హరీష్ రావు కు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై త్వరలోనే మంత్రికి లేఖ రాస్తానని అన్నారు.
అనంతరం మీడియాతో చాటుగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మెడికల్ కాలేజి కోసం ప్రత్యేకంగా ఆయనపై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఐఐటి హైదరాబాద్ ను ఉమ్మడి రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ కు తరలించాలని నాటి మంత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని… ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కి తరలించాలని కొందరు మంత్రులు ప్రయత్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఐఐఐటి హైదరాబాద్ సంగారెడ్డి లోనే స్థాపించడానికి వైయస్ రాజశేఖర రెడ్డిపై తాను చేసిన ఒత్తిడి, ప్రయత్నాలను ఈ సందర్భంగా తెలియజేశారు.
ఐఐటి హైదరాబాద్ సంగారెడ్డి లో ఏర్పాటు చేయనున్నట్లు నాటి సీఎం ప్రకటించినప్పుడే… సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.కాంగ్రెస్ హయాంలోనే సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినప్పటికీ.
ఏర్పాటులో కొంత సమయం పట్టిందని.సీఎం కేసీఆర్ కు కూడా పదే పదే విజ్ఞప్తి చేసిన క్రమంలో సంగారెడ్డికి మెడికల్ కళాశాల ను ప్రకటించారని అన్నారు.
సంగారెడ్డి మెడికల్ కళాశాలను సాధ్యమైనంత త్వరలో ప్రారంభించాలని సీఎంకు కోరారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.