దేశం కానీ దేశంలో ఓ భారతీయ మహిళ దోపిడీకి గురైంది.డబ్బు, ఇతర వస్తువులతో పాటు పాస్‌పోర్ట్ కూడా చోరీకి గురికావడంతో పరాయి దేశంలో బిక్కుబిక్కుమంటోంది.
వివరాల్లోకి వెళితే.స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక హోటళ్లలో ఒకటైన మాడ్రిడ్ హిల్టన్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది.
బాధితురాలిని ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన జస్మీత్ కౌర్‌గా గుర్తించారు.ఆమె వ్యాపార పనుల నిమిత్తం కొద్దిరోజుల క్రితం మాడ్రిడ్‌కు వచ్చారు.
దొంగతనం, ప్రస్తుతం తన దుస్థితిపై జస్మీత్ కౌర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ఎవరి సాయం అందడం లేదని, రోజులు గడుస్తున్నా స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తన ఫిర్యాదులపై స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.తన వద్ద ఎలాంటి నగదు లేదని జస్మీత్ కౌర్ వాపోయారు.మాడ్రిడ్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినప్పటికీ , నిందితులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపిస్తున్నారు.
దుండగులు తనను కొట్టి హోటల్ లాబీ ఏరియాలోని తన బ్యాగ్‌ను ఎత్తుకుపోయారని జస్మీత్ కౌర్ వెల్లడించారు.కనీసం హోటల్ అధికారులు కూడా తనకు సాయం చేయడం లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.తాను స్పెయిన్ వచ్చినప్పుడల్లా ఇదే హోటల్‌లో బస చేసేదాన్నని.ఇలా ఎప్పుడూ జరగలేదని జస్మీత్ కౌర్ పేర్కొన్నారు.డబ్బు, ఇతర విలువైన వస్తువులతో పాటు పాస్‌పోర్ట్ కూడా బ్యాగ్‌లోనే వుందని.ఇప్పుడు ఏం చేయాలో తనకు పాలుపోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో ఎక్కడా మహిళలకు భద్రత లేదని.తనకు సాయం చేయాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖను కోరుతున్నానని ఆమె వీడియోలో అన్నారు.
భారతదేశానికి తాను తిరిగి రావాలనుకుంటున్నానని, దయచేసి తనకు సాయం చేయాలని జస్మీత్ కౌర్ కోరారు.