ఏపీ లో సార్వత్రిక ఎన్నికలకు ముందు పదేపదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) లేఖలు రాస్తూ హడావుడి చేసిన మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య( Chegondi Harirama Jogaiah ) ఎన్నికల ఫలితాలు తర్వాత సైలెంట్ అయ్యారు. ఎన్నికలకు ముందు తన కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ జనసేన ను వీడి వైసీపీలో చేరడంతో అప్పటి నుంచి జోగయ్య సైలెంట్ గానే ఉంటున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కు జోగయ్య లేఖ రాశారు.ఈ లేఖ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో కూటమి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు( CM Chandrababu ) ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జోగయ్య శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాళ్లల్లో పరుగులు పెట్టిస్తారని భావిస్తున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు.సంక్షేమ ఫలాలు ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా ఉండాలి తప్ప , రాజకీయ వైరం కోరుకునే విధంగా ఉండకూడదని జోగయ్య పేర్కొన్నారు. అభివృద్ధి కూడా ఒకచోట కేంద్రీకరించొద్దని సూచించారు.
ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఆశిస్తున్న ఐదు శాతం రిజర్వేషన్లను తమ పాలనలో అమలు చేస్తారని భావిస్తున్నానని జోగయ్య లేఖలో ప్రస్తావించారు. గతంలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని, కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు అప్పటి సీఎం చంద్రబాబు అది సాధ్యం కాలేదు.
దీనిలో భాగంగానే ఈ కాపు రిజర్వేషన్( Kapu Reservation ) ప్రస్తావన చేసినట్లు అర్థమవుతుంది. కృష్ణా జిల్లాలకు వంగవీటి మోహన్రంగా పేరు పెట్టాలని జోగయ్య కోరారు.
ఈ సందర్భంగా పవన్ సినిమాల అంశాన్ని జోగయ్య ప్రస్తావించారు.

సినిమాలు మానివేయకుండానే సగం రోజులు షూటింగ్ లకు, మిగిలిన సగం రోజులు రాష్ట్ర పరిపాలనకు కేటాయించాలని పవన్ కు సూచించారు. పవన్ చేసే పనులు కూడా సమాజానికి ఉపయోగపడేవి, సందేశాత్మకంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో నిర్వీర్యమైన జిల్లా పరిషత్, మండల పరిషత్ ,పంచాయతీరాజ్ వ్యవస్థలను ఆ శాఖ మంత్రిగా బలోపేతం చేయాలని జోగయ్య లేఖలో పేర్కొన్నారు.
ప్రతి జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్వో ఆఫీసులు మొదలు, జిల్లా కలెక్టర్ భవనాలను సచివాలయ కట్టడాలను సమకూర్చి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, రోడ్లు ,డ్రైనేజీలు, సాగునీరు విద్యుత్ పారిశుధ్యం వంటి సౌకర్యాలకు పెద్దపీట వేయాలని జోగయ్య లేఖలో పేర్కొన్నారు.