మన ఇండియాలో చాలా శక్తివంతమైన వ్యాపారులు బిజినెస్‌లను విస్తరించాలని బ్యాంకుల్లో లోన్ తీసుకుంటుంటారు.అయితే కొందరు వాటిని తీర్చడంలో విఫలమై దివాలా తీస్తారు.
వాటిని చెల్లించుకోలేక విదేశాలకు పారిపోతుంటారు.కర్ణాటక వ్యాపారవేత్త విజయ్ మాల్య, గుజరాత్ బిజినెస్ మాన్ నీరవ్ మోది వంటి వారు దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు అలాంటి వారి జాబితాలోకి ఒక తెలుగు వ్యాపారవేత్త చేరబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఆ వ్యక్తి మరెవరో కాదు గునుపాటి వెంకట కృష్ణా రెడ్డి( Gunupati Venkata Krishna Reddy).
ఈయన జీవీకే గ్రూపు వ్యవస్థాపకులు.ఇప్పుడు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
జీవీకే గ్రూపు సంస్థలలో ఒకటైన జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకు లోన్స్ తిరిగి చెల్లించడంలో ఫెయిల్ అయ్యింది.ఫలితంగా ఈ సంస్థపైన దివాలా చర్యలు తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాదు బెంచ్ ఆదేశించింది.జీవీకేపై దాఖలైన రూ.15,576 కోట్ల పిటిషన్‌పై బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతల బృందం ఈ పిటిషన్‌ను ఫైల్ చేసింది.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లోన్ తీసుకున్నది జీవీకే పవర్ కంపెనీ కాదు.
దాదాపు 10 ఏళ్ల కిందట సింగపూర్-రిజిస్టర్డ్ జీవీకే కోల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐసీఐసీఐ బ్యాంకులో ఈ రుణం తీసుకుంది.ఆ లోన్‌కు జీవీకే పవర్ కంపెనీ గ్యారంటర్‌గా సైన్ చేసి అడ్డంగా ఇరుక్కుంది.2017 నుంచి ఈ లోన్ రీపేమెంట్స్ జరగడం లేదు.దాంతో ఐసీఐసీఐ బ్యాంకు 2022లో పిటిషన్ ఫైల్ చేయగా జీవీకే పవర్ కంపెనీ( GVK Power and Infrastructure ) మీద దివాలా చర్యలు తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది
జీవికే గ్రూపు చాలా మంచి పేరు ఉన్న సంస్థ.ఈ గ్రూప్ బెంగళూరు, ముంబై ఇంటర్నేషనల్ విమానాల్లో అనేక మౌలిక వసతులు బిల్డ్ చేసింది.అంతేకాదు విద్యుత్ ప్లాంట్స్ కూడా నిర్మించిన చరిత్ర ఉంది.
బెంగళూరు, ముంబై ఎయిర్ పోర్టులను మన తెలుగువాళ్లే కట్టారు అంటూ అప్పట్లో గొప్పగా చెప్పుకునే వారు.ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ వంటి రంగాల్లో జీవీకే గ్రూప్ ఓ వెలుగు వెలిగింది.
ఇప్పుడు అదే కంపెనీ దివాలా తీసింది కాబట్టి చాలామంది తెలుగువారు బాధపడుతున్నారు.తెలుగువాళ్లు కూడా పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించగలరని వెంకట కృష్ణా రెడ్డి నిరూపించారు.
కానీ దాన్ని ఆయన కాపాడుకోలేకపోయారు.నెక్స్ట్ జనరేషన్ కి స్ఫూర్తిగా నిలవాల్సిన ఆయన ఇప్పుడు ఈ పరిస్థితికి రావడం నిజంగా దురదృష్టకరం.