భారతీయుల పండుగలలో దీపావళి ( Diwali )ప్రత్యేకమైంది.చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.
దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లిపోతాం.జాతి, కుల, మత, వర్గ విభేదాలను పక్కనబెట్టి జాతి మొత్తం సమైక్యంగా జరుపుకునే పండుగే దివాళీ.
ఇప్పుడు ఇది సర్వజన ఆనందకేళిగా మారిపోయింది.భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ దివ్వెల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు.దీపావళి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు.తద్వారా మనదేశంలో జరుపుకునే రోజునే దాదాపు అన్ని దేశాల వారు దివాళీని జరుపుకుంటున్నారు.ఇక మనకు మరో ఇల్లుగా మారిన అమెరికా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఏకంగా అగ్రరాజ్యాధినేత కొలువుండే వైట్‌హౌస్‌లోనే దీపావళీ వేడుకలు జరుగుతాయి.మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden )లు శ్వేతసౌధంలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు.
అలాగే 2016లో దీవాళీకి తపాలా బిళ్ళను కూడా అమెరికా విడుదల చేసింది.ఈ క్రమంలోనే దీపావళికి అరుదైన గుర్తింపు లభించింది.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో ఈ రోజున స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు.ఈ మేరకు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్( Eric Adams ) ప్రకటన చేశారు.

మరో రెండ్రోజుల్లో దీపావళిని పురస్కరించుకుని తాజాగా వైట్‌హౌస్‌లో వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు.దాదాపు 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ .అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు భారీ దీపావళి వేడుకలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.సెనేటర్, వైస్ ప్రెసిడెంట్, దక్షిణాసియా అమెరికన్లు తన యంత్రాంగంలో కీలక సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు.
కమలా హారిస్ నుంచి డాక్టర్ వివేక్ మూర్తి వరకు మీలో చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని బైడెన్ పేర్కొన్నారు.జో బైడెన్ ప్రసంగానికి ముందు భారతీయ అమెరికన్ యువ కార్యకర్త సృష్టి, వైస్ అడ్మిరల్ , యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ హెచ్ మూర్తి తదితరులు దీపావళి ప్రాశస్త్యాన్ని వివరించారు.
అంతేకాదు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఓ వీడియో సందేశాన్ని పంపారు నాసా వ్యోమగామి , భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్.అమెరికా ఉపాధ్యక్షురాలు, ఫస్ట్ లేడీ డాక్టర్ జిల్ బైడెన్ ప్రచారంలో బిజీగా ఉండటంతో దీపావళి వేడుకలకు దూరంగా ఉన్నారు.







