టీడీపీకి మైలేజ్ తగ్గిందా ..? బాబు లో ఆందోళన పెరిగిందా ..?       2018-06-09   00:10:51  IST  Bhanu C

తెలుగుదేశం పార్టీకి జనాల్లో అనుకున్నంత మైలేజ్ రావడం లేదు. తిమ్మిని బమ్మి చేసి అన్నిటిని మేనేజ్ చూసుకునే చంద్రబాబు కి జనాల్లో మైలేజ్ పెంచుకునే విషయంలో మాత్రం మేనేజ్ చేసుకోలేకపోతున్నాడు. ఒక పక్క ఎన్నికలు చూస్తుంటే ఉరుముల్లేని పిడుగులా దూసుకొస్తున్నాయి. అయినా ప్రజల్లో అంత బలంగా మాత్రం వెళ్లలేకపోతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆందోళకు దిగితే ప్రజల్లో మద్దతు వస్తుందేమో అని ఆశిస్తే అది నిరాశే మిగులుస్తోంది.

ఏపీలో నవనిర్మాణ దీక్షలతో అనుకున్నంత మైలేజీ రాకపోవడంతో ఆయన నిరాశ చెందుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీక్షలు చేసినా ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రాష్టానికి కేంద్రం తీరని అన్యాయం చేసిందని, నాలుగేళ్లుగా ఏపీ అభివృద్ది చెందకపోవడానికి కేంద్రంలోని బీజేపీ కారణమని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి దీక్షలు చేశారు.అలాగే… విజయవాడ, తిరుపతిలో చేసిన దీక్షలకూ పెద్దగా స్పందన రాలేదు. చంద్రబాబు నవనిర్మాణదీక్షకు భారీగా హాజరైన కుర్చీలు అంటూ సోషల్ మీడియా లో కూడా బాగా సెటైర్లు వినిపించాయి.

ఆ తరువాత టీడీపీ మహానాడు జరిగింది. మళ్ళీ జూన్ 2వ తేదీ నుంచి నవనిర్మాణ దీక్షలు ఆరంభం అయ్యి ముగిశాయి. ఇప్పటికే మూడు సార్లు నవనిర్మాణ దీక్షలు చేశారు. ఈ దీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రతిజ్ఞలో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో కేవలం కాంగ్రెస్‌ను మాత్రమే విమర్శించిన ముఖ్యమంత్రి ఈసారి బిజెపిని కూడా ఆక్షేపించారు. కుట్ర చేసిందని, మోసం చేసిందని ఆరోపించారు.

కుట్ర రాజకీయాలను తిప్పికొడతానని, మోసాన్ని ఎదురిస్తానని ఆయన ప్రకటించారు. ఇవన్నీ ఎలా ఉన్నా కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన నవనిర్మాణ దీక్షలకు, ఆయన ఆవేశపూరిత ప్రసంగాలకు ప్రజలు ఏమాత్రం స్పందించలేదు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలల్నిబలవంతంగా తరలించినా వారు సైతం గంటలకంటే ఎక్కువ సమయం దీక్షాస్థలివద్ద నిలబడలేకపోయారు. దీంతో చెప్పకుండానే ప్రభుత్వం పై ప్రజావ్యతిరేకత ఉన్నట్టు అర్ధం అవుతోంది.

ఇది ఇలా ఉంటే… పాదయాత్ర పేరుతో జనాల్లో తిరుగుతున్న జగన్ ప్రజలు మద్దతు కూడగట్టడం లో విజయం సాధించారు. ఆయన ప్రభుత్వాన్ని వివిధ సమస్యల మీద సూటిగా ప్రశ్నించడం.. దానికి టీడీపీ సరైన సమాధానం చెప్పలేకపోవడం టీడీపీ దుస్థితికి అర్ధం పడుతోంది. అలాగే వివాద సంస్థలు చేపడుతున్న సర్వేల్లో కూడా టీడీపీ క్రేజ్ గణనీయంగా తగ్గినట్టు తేలుతుండడం ఆ పార్టీని అయోమయానికి గురిచేస్తోంది.