ఆలుగడ్డ నిజంగానే మంచిది కాదా ? దాన్ని ఎలా వండుకుంటే మంచిది ?  

ఎవరికైనా బీపి కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి .. ఆలు తినడం మానేయ్యండి అంటారు. కొంచెం బరువు ఎక్కినా ఆలుగడ్డ వద్దంటారు. కొలెస్టరాల్ ఉంటే ఆలుగడ్డ వద్దంటారు .. ఉబ్బసం వచ్చినా ఆలుగడ్డ వద్దంటారు .. ఇలా ఎన్నో రకాలుగా ఆలుగడ్డ గురించి చెబుతారు. మరి ఆలుగడ్డ నిజంగా అంత పనికిరాని కూరగాయ ? దీనితో ఎలాంటి లాభం లేదా ? ఎలాంటి న్యూట్రింట్స్ ఉండవా ? కొవ్వు ఎక్కువ ఉంటుందా ? తింటే బరువు పెరిగిపోతారా? ఒంట్లో నీరు ఎక్కువైపోతుందా? ఇలా ఎన్నో అనుమానాలు మనకు ఉంటాయి. కాని ఆలుగడ్డను పక్కనపెట్టుకోలెం. ఎందుకంటే రుచి అలాంటిది. మరి ఆలుగడ్డని తినాలో వద్దో, తింటే ఎలా తినాలో చూడండి.

నిజానికి బయట ఉన్న చెడ్డపేరుని అనవసరంగా మోస్తోంది ఆలుగడ్డ. ఇది మరీ అలాంటి పనికిరాని ఆహారపదార్ధం కాదు. దీని వలన ఎలాంటి లాభం లేకపోతె అసలు దీన్ని ఓ కూరగాయగా గుర్తించేవారే కాదు. ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే, ఇది అనారోగ్యకరం ఎప్పుడు అవుతుంది అంటే, దీన్ని సరైన పధ్ధతిలో వండకపోయినప్పుడే. దీంట్లో కాలరీలు మరీ ఎక్కువేమి ఉండవు. సగటున ఒక్కో ఆలుగడ్డలో 110 కాలరీలు ఉంటాయి. ఒక అరటిపండులోనూ అంతేగా ఉండేది. మరి అరటిపండు పెంచని బరువు ఆలుగడ్డ ఎలా పెంచుతుంది ? దాన్ని ఫ్రై చేసుకొని వండితే పెంచుతుంది.

ఆలుగడ్డలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కొన్ని ఆకుకూరల్లో ఎలిమెంట్స్. ఈ ఫైటోకెమికల్స్ బ్లడ్ ప్రెషర్ ని పెంచడము కాదు, నిజానికి తగ్గిస్తాయి. కాని ఎప్పుడైతే మీరు ఆలుగడ్డని ఫ్రై చేస్తారో, ఎక్కువ ఉష్ణోగ్రతల్లో ఉంచి వండుతారో, ఈ ఫైటోకెమికల్స్ ఉండవు. అప్పుడు ఆలుగడ్డలో స్టార్చ్ మాత్రమే మిగులుతుంది. నామమాత్రంగా కొన్ని మినరల్స్ ఉంటాయి అంతే. ఫ్రై చేయడం వలన కాలరీలు పెరిగిప్తాయి, అలాగే ఫ్యాట్స్ పెరిగిపోతాయి. దాంతో ఆలుగడ్డ కేవలం కాలరీలు అందించే ఆహారంగా మిగిలిపోతుంది. అలా కాకుండా ఉడకపెట్టి వండుకుంటే మంచి లాభాలు ఉంటాయి.

సోడియం లెవల్స్ పెరిగినప్పుడే ఒంట్లో నీరు ఎక్కువైపోతుంది. శరీరం ఉబ్బుతుంది. దీనికి ఆలుగడ్డతో సంబంధం లేదు. ఎందుకంటే శరీరంలో నీరు పెరిగేది సోడియం లెవల్స్ పెరగడం వలన. ఆలుగడ్డలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. పొటాషియం లెవల్స్ ఉండటం వలన ఇది గుండెకి మంచిది. కొలెస్టరాల్ పెరిగిపోతుంది అనడం కూడా నిజం కాదు. ఎందుకంటే దీంట్లో కొలెస్టరాల్ చాలా తక్కువ. ఇక బరువు పెరిగిపోతారు అంటారు .. ఉడకబెట్టి వండితే ఎలా పెరుగుతారు ? దీంట్లో ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణశక్తికి మంచి ఆహారం అలాగే బరువు తగ్గేలా చేస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉండటం విశేషం. కాబట్టి ఆలుగడ్డను తినడం అనారోగ్యం కాదు, దాన్ని తప్పుగా తినడం అనారోగ్యం.