టిడిపి సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి( Gorantla Buchaiah Chowdhary ) కి పెద్ద కష్టమే వచ్చింది.ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీలో ఉన్న బుచ్చయ్య చౌదరి, ఆ తరువాత చంద్రబాబుతోనూ సన్నిహితంగానే వెలుగుతున్నారు.
ఏ విషయంలో అయినా, ఉన్నదన్నట్లుగా మాట్లాడుతూ, అప్పుడప్పుడు అధినేతకు చురుకులు అంటిస్తూ ఉంటారు.ఇప్పుడు అటువంటి బుచ్చయ్య కు పెద్ద కష్టమే వచ్చి పడింది.
వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే సీటు జనసేనతో పొత్తులో భాగంగా, ఆ పార్టీ కే కేటాయించే అవకాశం ఉందన్న వార్తలతో బుచ్చయ్య టెన్షన్ పడుతున్నారు.పొత్తు ఉన్నా, లేకున్నా రాజమండ్రి( Rajahmundry ) రూరల్ టికెట్ తనదేనని, తానే అక్కడి నుంచి పోటీ చేస్తానని బుచ్చయ్య చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి తాను పోటీ చేస్తున్నానని బుచ్చయ్య ప్రకటించారు.గత ఎన్నికల్లో విజయం సాధించినా, వారు తిరిగి వారి వారి స్థానాలు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టిక్కెట్లు ఇస్తున్నామని చెప్పారని, అందుకే తాను మళ్ళీ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తానని బుచ్చయ్య చెబుతున్నారు.
ఇదే సీటు పై జనసేన( Janasena ) కూడా ఆశలు పెట్టుకుంది.రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అలాగే జనసేనకు ఇక్కడ ఆదరణ ఎక్కువగా ఉందని ఆ పార్టీ అంచనా వేస్తోంది .అందుకే పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ ను జనసేనకు కేటాయించాలని ముందుగానే అలర్ట్ అవుతుంది.అక్కడ నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించుకుంటున్నారు.
అయితే ఈ విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది .
ఈ సీటు విషయంలో జనసేన నుంచి తీవ్రంగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బుచ్చయ్య చౌదరిని ఏవిధంగా బుజ్జగిస్తారు ? ఆయనకు ఏ సీటు కేటాయిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.ఎవరు ఏం చెప్పినా, రూరల్ టిక్కెట్ ను వదులుకునేందుకు మాత్రం బుచ్చయ్య సిద్ధంగా లేననే సంకేతాలను ఇస్తున్నారు.