టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సామాజిక సేవలో పాల్గొన్నారు.సినిమాలలో హీరోల పాత్రల్లో నటించి హీరో అనిపించుకున్న చిరంజీవి, రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి దానధర్మాలు చేసి రియల్ లైఫ్ హీరో అని కూడా అనిపించుకున్నారు.
ఇండస్ట్రీలో మంచి మనసు ఉన్న వారిలో చిరంజీవి ఒకరిగా చెప్పుకోవచ్చు.చిరంజీవి ఎక్కువగా సామాజిక సేవలో ముందుంటారు.
సినీ ఇండస్ట్రీ వారైనా, సామాన్యులు అయినా, అభిమానులు అయినా ఆపదలో ఉన్నారు అని తెలిస్తే వెంటనే స్పందిస్తారు.ఇక కరోనా సమయంలో అయితే సినీ ఇండస్ట్రీలో కార్మికుల కోసం సహాయం చేయడంలో ఆయన ముందు వరసలో నిలిచారు.
మెగాస్టార్ కు అభిమానులు అంటే ప్రత్యేక అభిమానం.గతంలో అభిమానుల పట్ల తనకున్న ప్రేమను ఇప్పటికే ఎన్నోసార్లు వ్యక్త పరిచారు.ఇదిలా ఉంటే తాజాగా మరొకసారి తన గొప్ప మనసు చాటుకున్నారు చిరంజీవి.శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో టీ దుకాణం నడిపే తన అభిమాని కుమార్తె వివాహానికి మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం పంపారు.
రాజాం పట్టణంలోని కొండం పేటకు చెందిన కొండలరావు అనే వ్యక్తి చిరంజీవి కి వీరాభిమాని.
గత 30 ఏళ్లుగా టీ దుకాణం నిర్వహిస్తూ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాడు.ఇకపోతే ఇటీవలే అతని కుమార్తె నీలవేణి వివాహం అయింది.దీంతో మెగాస్టార్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ చిరంజీవి దంపతులు, తమ్ముళ్లు నాగబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలను పెళ్లి పత్రికలో ముద్రించాడు.
ఇక అఖిల భారతీయ చిరంజీవి యువత వ్యవస్థాపకులు అయిన రవణం స్వామినాయుడు ద్వారా ఈ విషయం మెగాస్టార్ వరకు వెళ్ళింది.
ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే అతడి ఖాతాలో లక్ష రూపాయలు జమ చేశారు.అంతేకాకుండా అభిమాని కొండలరావు కూతురుకి సోషల్ మీడియా వేదికగా ఆశీస్సులు అందజేశారు.స్థానిక చిరంజీవి యువత సంఘం సభ్యులు కూడా కొండలరావు ఇంటికి వెళ్లి వారి తరఫున మరొక లక్ష రూపాయలను అందజేశారు.
దీనితో కొండలరావు ఆనందం ఆకాశాన్నంటింది.