కమల్ హాసన్.విశ్వ నటుడిగా పేరు తెచ్చుకున్న ఈ దిగ్గజ నటుడు చేసినన్ని పాత్రలు మరే హీరో చేయలేదని చెప్పుకోవచ్చు.65 ఏండ్ల వయసున్న ఆయన 60 ఏండ్ల సినిమా కెరీర్ ఉంది.ఆరేండ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన ఆయన.తొలి సినిమాకే ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.1960లో వచ్చిన తమిళ మూవీ కళత్తూర్ కన్నమ్మలో ఆరేండ్ల అనాథ బాలుడిగా అద్భుతంగా నటించి జాతీయ అవార్డును అందుకున్నాడు.అప్పటి నుంచి తను నటించిన ఎన్నో చిత్రాలు జనాల మదిలో నిలిచిపోయాయి.పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం కమల్ నైజం.
బాల నటుడి నుంచి హీరోగా మారిన తర్వాత మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు కమల్.ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి సినిమా 1982లో వచ్చిన మూండ్రం పిరై.
బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో వసంత కోకిల పేరుతో విడుదల అయ్యింది.తెలుగు జనాలను ఈ సినిమా ఎంతో ఆకట్టుకుంది.
మతిస్థిమితం కోల్పోయిన శ్రీదేవికి అన్నీతానై కాపాడుకునే టీచర్ పాత్రలో కమల్ అద్భుత అభినయం కనబర్చాడు.ఈ సినిమాలో పడిన వేదన చూసి జనాలు కంటతడి పెట్టారంటే ఆయన నటన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
రెండోసారి హీరోగా జాతీయ అవార్డు పొందిన సినిమా 1987లో వచ్చిన నాయకుడు.ఒకప్పటి ముంబై అండర్ వరల్డ్ డాన్ మొదలియార్ జీవిత కథ ఆధారంగా మణిరత్నం రూపొందించిన ఈ సినిమాలో కమల్ వేలు నాయకర్ పాత్ర పోషించాడు.ఈ సినిమాలో కమల్ నటనకు ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి.
మూడోసారి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సినిమా 1996లో వచ్చిన భారతీయుడు.దేశంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనాన్ని చూపిస్తూ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సినిమా ఇది.లంచగొండి అయితే తన కొడుకు అని కూడా చూడకుండా ప్రాణాలు తీసే తండ్రి పాత్రలో కమల్ నటించిన తీరు అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు.ఈ మూడు సినిమాలే కాదు.అమావాస్య చంద్రుడు, పుష్పక విమానం, సాగర సంగంమం, సాగర ముత్యం, స్వాతిముత్యం, మరో చరిత్ర, ఆకలి రాజ్యం, మహానది సినిమాల్లో కమల్ నటనకు తలవంచి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.