తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఈరోజు మంత్రి ఈటల వ్యవహారం మీడియాలో వైరల్‌గా మారడంతో నేతల దృష్టి అంతా ఈ వ్యవహారం వైపు మళ్లింది.
ఈరోజూ మధ్యాహ్నం నుండి టీఆర్ఎస్ పార్టీ అధికారిక ఛానల్‌గా గుర్తింపు ఉన్న టీ న్యూస్‌తో పాటుగా, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పలు ఛానళ్లలో కూడా ఆరోగ్య శాఖ మంత్రి భూ కబ్జాకు సంబంధించిన అంశం హైలెట్ గా మారింది.
అయితే ప్రభుత్వ తీరుపట్ల మొదటి నుండే అసంతృప్తిగా రాజేందర్ ఉన్నట్లు పలుమార్లు ప్రచారం జరిగింది.
ఒక్కోసారి ఈటల మాటలను ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉండటం, మరోవైపు కేసీయార్ తర్వాత ఈటల రాజేందర్కే తెలంగాణ సీయం ఆయ్యే లక్షణాలున్నాయనే ప్రచారం కూడా అంతర్గతంగా సాగిందనే వార్తలు వచ్చాయి.
ఈ దశలో ఈటలను పదవి నుండి తప్పించే ఆలోచనలో పార్టీ పెద్దబాసు ఉన్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపధ్యంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో అప్పడు కలెక్టర్‌గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, సీఎం కేసీఆర్‌కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.
దీంతో ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అయితే తనపై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మీడియా ముందుకు వచ్చి తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి ఈ వ్యవహారంతో తెలంగాణ రాజకీయనేతల్లో ఉలిక్కిపాటు మొదలైందట.