మనం చినప్పటినుంచి చూస్తూనే ఉంటాం లక్ష్మీ దేవి అనగానే తామర పువ్వులో కూర్చుని, పక్కన రెండు ఏనుగులు, అమ్మవారి చేతిలో నుంచి డబ్బులు కింద పడుతూ ఉన్నటువంటి ఫోటో మన మెదడులో కదులుతుంది.అయితే ఎప్పుడైనా లక్ష్మీదేవి తామర పువ్వులోనే ఎందుకు కొలువై ఉంటుంది? అని అనుమానం కలిగిందా? అసలు లక్ష్మీదేవి తామర పువ్వు పైన కూర్చోవడానికి గల కారణం ఏమిటి?దాని వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏమిటో చాలా మందికి తెలియదు.అయితే లక్ష్మీదేవి ఆ విధంగా ఆసీనురాలు కావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
తామర పువ్వును చూడగానే అలజడితో ఉన్న మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
తామర పువ్వు స్వచ్ఛతకు ప్రతీక.నిజానికి తామర పువ్వు బురద నుంచి పుడుతుంది.
ఆ విధంగా బురద నుండి పుట్టినప్పటికీ తామర పువ్వుకు ఎలాంటి బురద అంటకుండా స్వచ్ఛంగా బయటకు వస్తుంది.అదేవిధంగా మన జీవితంలో కూడా ఇతరుల గురించి పట్టించుకోకుండా సొంతంగా, స్వచ్ఛమైన మనసుతో ఎదగాలని తామర పువ్వు మనకు సూచిస్తుంది.
తామర పువ్వు కొలనులో లేదా సరస్సులో పుడుతుంది.సరస్సులో ఉన్నటువంటి ఈ తామర పువ్వుకు నిలకడ ఉండదు.నీటి ప్రవాహం వచ్చినప్పుడల్లా అటూ ఇటూ కదులుతూ ఊగుతూ ఉంటుంది.అలాంటి తామర పువ్వు పై కూర్చుని మనకు దర్శనమిస్తున్న లక్ష్మీదేవి కూడా తను ఒక చోట స్థిరంగా ఉండనని, తాను నిలకడ లేని దానినని చెప్పడం కోసమే లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉంటారు.
మన ఇంట్లో కూడా డబ్బు ఎప్పుడూ నిలకడగా ఉండదు.కొన్నిసార్లు ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటే, కొన్నిసార్లు ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.ఈ విషయాన్నే లక్ష్మీదేవి తామర పువ్వు పై కూర్చుని మనకు తెలియజేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
TELUGU BHAKTHI