ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.మనిషి భూమి మీద నుంచి మార్స్ మీదకు వెళ్లే స్థాయికి ఎదిగాడు.
అయితే నేటికీ కొన్ని గ్రామాల్లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా కొందరు మనుషుల ఆలోచనా తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు.
తాజాగా కడప జిల్లాలోని ముద్దనూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఒక లారీ డ్రైవర్ సిమెంట్ బస్తాలను దొంగలించాడనే ఆరోపణలతో వ్యాపారి క్రూరంగా వ్యవహరించాడు.
తన దగ్గర పని చెసే లారీ డ్రైవర్ ను చితకబాదాడు.వ్యాపారితో పాటు అతని అనుచరులు విచక్షణారహితంగా లారీ డ్రైవర్ పై దాడి చేసి ఆ వ్యక్తి గాయాలపాలయ్యేలా చేశారు.
కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ముద్దనూరులోని గుర్రప్ప ట్రాన్స్ పోర్ట్ యజమాని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
సదరు లారీ డ్రైవర్ ను అనుచరులు చిత్ర హింసలకు గురి చేసిన సమయంలో యజమాని ఆ దృశ్యాలను వీడియో తీసి పైశాచికానందం పొందాడు.అనంతరం ఆ వీడియోను తన దగ్గర పని చేసే ఇతర లారీ డ్రైవర్లకు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు.
అయితే ట్రాన్స్ పోర్ట్ యజమాని మాత్రం ఈ ఘటనను సమర్థించుకుంటున్నాడు.తాను చేసిన ఈ పని వల్ల ఇతర డ్రైవర్లకు దొంగతనం చేయాలనే ఆలోచన రాదని చెబుతున్నాడు.
దెబ్బలు తిన్న డ్రైవర్ అనంతరం కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.