సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ సినిమాలో భారత్ నుంచి చైనా వెళ్లిన బోధి ధర్ముడు అక్కడ తెలియని వ్యాధితో చనిపోతున్న వాళ్లకి వైద్యం చేసి జబ్బును నయం చేస్తాడు.ఆ ఊరు వాళ్లని కాపాడుకుంటూ వుంటాడు.
దీంతో గ్రామస్తులు బోధి ధర్ముడిని దైవంలా చూస్తారు.తర్వాత కాలంలో ఆయన గొప్పతనం తెలుసుకుని గుడులు కట్టి, విగ్రహాలు పెట్టి పూజిస్తారు.
కొన్ని వందల ఏళ్ల తర్వాత అచ్చం ఆయనలాగే భారతదేశం నుంచి వెళ్లిన ఓ వైద్యుడిని చైనీయులు దైవంలా కొలుస్తున్నారు.ఆయనే డాక్టర్ ద్వారకానాథ్ కోట్నిస్.
రెండో ప్రపంచ యుద్ధకాలంలో చైనాలో వైద్య సేవలు అందించిన కోట్నిస్‌కు ఆ దేశంలో విశేషమైన గౌరవం వుంది.అంతేకాదు.
చైనా నేతలు, ప్రముఖులు ఎవరు భారత్ వచ్చినా డాక్టర్ ద్వారకానాథ్ కోట్నిస్ కుటుంబసభ్యుల్ని కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.అంతటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని వచ్చే నెలలో షిజియాజువాంగ్ నగరంలోని ఓ మెడికల్ కాలేజీ ఎదుట ఏర్పాటు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది.
డాక్టర్ ద్వారకానాథ్ శాంతారామ్ కోట్నిస్ 1910 అక్టోబర్ 10వ తేదీన మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించారు.యూనివర్సిటీ ఆఫ్ బొంబాయి స్టేట్ జీఎస్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించిన ఆయన 1938లో చైనాకు వెళ్లారు.జపాన్ దురాక్రమణపై పోరాడుతున్న చైనా కమ్యూనిస్ట్ పార్టీ సైన్యానికి వైద్య సాయం అందించడానికి నాటి మన జాతీయ నేతలు ఒక వైద్య బృందాన్ని అక్కడికి పంపించారు.ఇందులో ద్వారకానాథ్ కూడా ఉన్నారు.1942లో మరణించే వరకు చైనాలో ఉన్నారు.ఆయన స్థానిక యువతినే వివాహం చేసుకున్నారు.