ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.ఇప్పటికే భారత్లో పలు దఫాలుగా లాక్డౌన్కు సడలింపులు ఇస్తూ వస్తున్నా, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
కాగా మే 31వ వరకు 4వ దశ లాక్డౌన్ దేశవ్యాప్తంగా అమలులో ఉండనున్న విషయం తెలిసిందే.అయితే ఈ లాక్డౌన్ మే 31తో ముగుస్తుందా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం లేదనే చెప్పాలి.
కాగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ను ఇప్పుడప్పుడే ఎత్తేయకూడదని, కరోనా వ్యాప్తిని పూర్తిగా నియంత్రించేందుకు ఈ లాక్డౌన్ కొనసాగింపు ఉండాలని ఓ నిర్ణయం తీసుకుంది.హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 214 కేసులు మాత్రమే నమోదవగా, ఐదుగురు మృత్యువాత పడ్డారు.
అయినా సరే ఈ మందులేని మహమ్మారిని కట్టడి చేయాలంటే ఇంకా లాక్డౌన్ను పొడిగించాలని భావించిన అక్కడి ప్రభుత్వం, ఏకంగా జూన్ 30 వరకు లాక్డౌన్ను పొడిగించింది.
దీంతో అక్కడి ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటికే రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితం అయ్యామని, ఇంకా లాక్డౌన్ పొడిగిస్తే తమ బతుకులు దర్భరంగా మారుతాయని వారు వాపోతున్నారు.మిగతా రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు ఉండటంతో తమ రాష్ట్రంలో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది కాబట్టి లాక్డౌన్ ఎత్తివేయాలని అక్కడి జనం కోరుతున్నారు.
కానీ ఏదేమైనా లాక్డౌన్ కొనసాగించడం ఖాయమని అక్కడి ప్రభుత్వం తెలిపింది.మరి కేంద్రం కూడా మే 31 తరువాత లాక్డౌన్ను పొడిగిస్తుందా అనే సందేహం ప్రస్తుతం అందరిలో తలెత్తుతోంది.