ఏపీలో రానున్న రోజుల్లో మంచి దమ్మున్న నాయకుడిగా బలపడాలనే ఆలోచన చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.అయితే ప్రస్తుతం పవన్ కు ఉన్న బలం బలగం సరిపోదనే ఆలోచన పవన్ కు ఉంది.
మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వడంతో పాటు బలమైన అధికార పార్టీని ఎదుర్కోవడం తన ఒక్కడి వల్లా కాదని పవన్ ఒక అంచనాకు వచ్చేసారు.ఇక బీజేపీ కూడా ఏపీలో బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అయితే బీజేపీ ప్రజలలోకి వెళ్లే విషయంలో చాలా వెనకబడి ఉంది.అంతే కాదు క్షేత్ర స్థాయిలో బలహీనంగా ఉండడం ప్రజా ఆకర్షణ కలిగిన బలమైన నాయకులు ఏపీలో లేకపోవడం తదితర కారణాల వల్ల బీజేపీ సొంతంగా ఎదగలేక పోతోంది.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ ను చేరదీయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

జనసేన మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనే బలమైన నమ్మకంతో పవన్ ఉండిపోయారు.అందుకే మొన్నటి ఎన్నికల్లో అధికార, విపక్షాలు, బిజెపి మినహా కామ్రేడ్ లు, బీఎస్పీ సహా జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగినా కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే దక్కించుకుంది.అది కూడా అక్కడి అభ్యర్థి సొంత ఇమేజ్ కారణంగానే అన్నది అందరికి తెలిసిందే.
మిగిలిన చోట్ల అభ్యర్థులంతా వైసిపి గాలి ముందు నిలబడలేకపోయారు.పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాకలో ఓటమి పాలుకావడంతో ఆ పార్టీ పై భవిష్యత్తు ఇప్పటికీ అగమ్య గోచరంగా ఉంది.
ఈ నేపథ్యంలో పార్టీలో ముందు నుంచి కీలకం గా వ్యవహరించిన మారిశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డాక్టర్ ఆకుల సత్యనారాయణ వంటి నాయకులంతా ఎన్నికల ముందు తరువాత పార్టీని విడిచిపెట్టేసారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో పాటు రానున్న రోజుల్లోనూ ఆ పార్టీ హవాకు ఏ మాత్రం ఢోకా లేకుండా ఉండడంతో పవన్ బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.గతంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ రహస్య పర్యటన వెనుక అంతరార్ధం ఇదే అని వైసిపి గ్రహించే ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది.అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తరువాత జగన్ రెడ్డి అంటూ కుల ప్రచారం ఆయన మతం మీద చేస్తున్న కామెంట్స్ వెనుక బీజేపీ వ్యూహం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన నాటి నుంచి జగన్ లక్ష్యంగానే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు.అధికారంలో చంద్రబాబు వున్నా, అరకొరగా మాత్రమే విమర్శలకు దిగేవారు.ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నాడు.బీజేపీ పెద్దలు జనసేనను తమ పార్టీలో విలీనం చేయాల్సిందిగా కోరుతున్నా పవన్ మాత్రం పొత్తు వరకే పరిమితం అవ్వాలని చూస్తున్నాడు.
ఈ రెండు విషయాల్లో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాగానే పొత్తా, విలీనమా అనే విషయం తేలిపోనుంది.