తల్లి దండ్రులని మించిన దేవుళ్ళు దేవతలు లేరని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం.తోలిపూజలు అందుకునే వినాయకుడు కూడా కార్తికేయుడితో జరిగిన ఓ పోటిలో ప్రపంచాన్ని చుట్టి రమ్మంటే తల్లిదండ్రుల చుట్టే తిరిగి పోటిలో నెగ్గుతాడు.
అక్కడే అర్థం చేసుకోండి తల్లిదండ్రుల గొప్పతనం ఏమిటో.మరి తల్లిదండ్రులని పూజించడం అనే పద్ధతికి అంత ప్రాముఖ్యత ఉంది కదా, ఒక తల్లి తన బిడ్డని పూజించడం ఎంత వరకు సరైన విషయం అంటారు ? అందులో ఏమైనా తప్పు ఉందా ? ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకి సమాధానం మాదగ్గర అయితే లేదు కాని, సాక్షాత్తు పార్వతి దేవి గణపతిని పూజించినట్టు పూరాణాలు చెబుతున్నాయి.ఆ కథేంటో మీరే చూడండి.
పంచాక్షరీ మంత్రం యొక్క విశిష్టతను గుర్తించిన పార్వతీ దేవి ఒకనాడు ఆ మంత్రాన్ని తనకి ఉపదేశించమని పరమ శివుడిని అడుగు తుంది.
మంత్రాన్ని ఉపదేశించిన శంకరుడు కొంత కాలం ఆ మంత్రాన్ని జపించమని, అంత వరకు ఎవరితోనూ మాట్లాడ కూడదని చెబుతాడు.కాని పార్వతి దేవి శివుడి మాటను లెక్కచేయకుండా తన చెలికత్తెలకు తమ సంభాషణ అంతా వివరంగా చెబుతుంది.
దాంతో ఆగ్రహించిన మహాశివుడు మనుష్య రూపం దాల్చి పంచాక్షరి మంత్రాన్ని కొంతకాలం పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా జపిస్తే తప్ప, తన పక్కన కూర్చోవద్దని చెప్పాడు.శివుడి కరుణ మళ్ళీ పొందేందుకు కైలాసం వదిలిన పార్వతీదేవి భూలోకాన్ని చేరుకుంది.

పార్వతి దేవి ఒక మనిషిరూపంలో పంచాక్షరి మంత్రాన్ని జపించిన ఆ ప్రదేశం ఏమిటి అనుకుంటున్నారు ? ఇప్పుడున్న శ్రీకాళహస్తి. తన తపస్సుకి ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉండకుండా, మనిషి రూపంలో ఉన్న పార్వతి దేవి విఘ్నాలను తొలగించే గణపయ్యకి పూజలు చేసింది.ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమె తపస్సు ఫలించడంతో శివుడు తిరిగి కరుణించాడు.కైలాసానికి తిరిగి బయలు దేరే సమయంలో ఇక్కడే పశ్చిమ దిక్కులో పుష్టి గణపతిగా వెలుగొంది, భక్తుల విఘ్నాలు తొలగించమని గణేషుడికి చెప్పింది.
శ్రీకాళహస్తిలో ఇప్పటికి పుష్టి వినాయకుడు దర్శనమిస్తాడు.పార్వతిదేవి గణపతిని పూజించిన ఆలయం అదొక్కటే అని కొందరు చరిత్రకారులు చెబుతారు.