అగ్రరాజ్యంగా, ప్రపంచ పెద్దన్నగా, అత్యంత సంపన్న దేశంగా గుర్తింపు తెచ్చుకున్న అమెరికాలో నిరుపేదలు సైతం వున్నారు.ముఖ్యంగా ఇళ్లు లేని నిరాశ్రయుల సంఖ్య అక్కడ లక్షల్లో వుంది.
వీరంతా ఫుట్‌పాత్‌లపై, ఖాళీ మైదానాల్లో, వంతెనల కింద గుడారాలు వేసుకుని జీవిస్తుంటారు.పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థలు వీరికి సాయం చేస్తున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదు.
అయితే ఇలాంటి వారిని అడ్డం పెట్టుకుని పబ్బం గడిపేవారు కూడా అమెరికాలో వున్నారు.
తాజాగా ఇల్లులేని వ్యక్తికి సాయం చేయాలంటూ కట్టుకథ అల్లడమే కాకుండా గో ఫండ్ మీ ద్వారా విరాళాలు సేకరించడంలో సాయం చేసిన వ్యక్తికి శుక్రవారం ఫెడరల్ కోర్టు రెండేళ్లకు పైగా జైలు శిక్ష విధించింది.
నిందితుడిని మార్క్ డి అమికోగా తెలిపారు.అతని 27 నెలల శిక్షాకాలం పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల ప్రొబేషన్‌ను కూడా అనుభవించాల్సి వుంటుంది.అంతేకాదు నష్టపరిహారం చెల్లించాలని.డ్రగ్స్, గ్యాంబ్లింగ్‌కు సంబంధించి మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ చేయించుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
తీర్పు సందర్భంగా నిందితుడు మార్క్ డి అమికో మాట్లాడుతూ.తాను మారిపోయానని, కుటుంబానికి అంకితమయ్యానని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి నోయెల్ హిల్‌మాన్‌తో చెప్పాడు.
ఈ నేరానికి సంబంధించి గతేడాది నవంబర్‌లోనే కామ్‌డెన్‌లోని హిల్‌మాన్ ఎదుట నేరాన్ని అంగీకరించాడు మార్క్.అతనిపై కుట్ర, వైర్ ఫ్రాడ్, మనీలాండరింగ్ సహా మొత్తం 16 కౌంట్ల అభియోగాలు మోపారు పోలీసులు.
ఈ కేసులో ఇతని మాజీ స్నేహితురాలు కాటెలిన్ మెక్‌క్లూర్, నిరాశ్రయులైన జానీ బాబిట్ జూనియర్‌లు తమ నేరాన్ని అంగీకరించారు.దీంతో ఈ ఏడాది ఆరంభంలో వీరిద్దరికి కూడా న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.a
ప్రాసిక్యూటర్‌ల కథనం ప్రకారం.ఫిలడెల్ఫియాలోని మెక్‌క్లూర్ కారులో గ్యాస్ అయిపోవడంతో ఆమెకు బాబిట్ 20 డాలర్ల సాయం చేశాడు.దీంతో బాబిట్‌కు సాయం చేసేందుకు గాను వార్తాపత్రికలు, టీవీ ఇంటర్వ్యూలను నిర్వహించారు.ఈ మొత్తం వ్యవహారానికి మార్క్ ప్రధాన సూత్రధారి అని తెలిపారు.అంతేకాకుండా గో ఫండ్ మీ ద్వారా నెలలోనే 4,00,000 డాలర్లను విరాళాల రూపంలో సేకరించారు.అయితే పోలీసుల దర్యాప్తులో వారు గో ఫండ్ మీలో చెప్పినదంతా కట్టుకథగా తేలింది.
అక్టోబర్ 2017లో వీరు ముగ్గురు ఫిలడెల్ఫియాలోని క్యాసినో సమీపంలో కలుసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.
బాబిట్ దంపతులు తమకు మార్క్, మెక్‌క్లూర్‌లు విరాళాల మొత్తంలో వాటా ఇవ్వలేదని ఆరోపిస్తూ వారిపై దావా వేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది.
విరాళంలో సేకరించిన మొత్తాన్ని మార్చి 2018 నాటికి ఖర్చు చేశారని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.మెక్‌క్లూర్, మార్క్‌లు బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయడంతో పాటు లాస్‌వెగాస్, న్యూజెర్సీలలోని క్యాసినోలకు వెళ్లేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేసేశారని తెలిపారు.