మనలో చాలామంది చీటికిమాటికి ఎంతో కోపం తెచ్చుకుంటారు.ఈ విధంగా కోపం తెచ్చుకునే వారిని దుర్వాసమహర్షితో పోలుస్తారు.
పురాణాల ప్రకారం దుర్వాసమహర్షికి ఎంతో కోపం ఉండేది.ఈయన కోపం వల్ల సాక్షాత్తు విష్ణుమూర్తి సహా పలువురు దేవతలను కూడా శపించారు.
అసలు దుర్వాస మహర్షికి ఈ విధంగా కోపం రావడానికి గల కారణం ఏమిటి? ఈ కోపానికి దుర్వాసమహర్షి పుట్టుకకు ఏమైనా కారణం ఉందా? మన పురాణాలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
మన పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి పుట్టుక వెనుక ఎన్నో కథలు ఉన్నాయి.ఒకసారి బ్రహ్మ, పరమేశ్వరుడికి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
వీరి మాటలు పెరిగి పెరిగి ఎన్నో ప్రళయాలకు దారితీశాయి.దీంతో పరమేశ్వరుడు ప్రళయరుద్రుడిగా మారారు.
పరమేశ్వరుడి కోపానికి తట్టుకోలేక దేవతలు తల్లడిల్లిపోయారు.పార్వతి దేవి కూడా శివుని కోపాన్ని తట్టుకోలేక పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి “దుర్వాసంభవతిమి” అని చెబుతుంది.
ఈ మాటకు అర్థం మీతో కాపురం చేయడం కష్టమైపోతోంది అంటూ వాపోయింది.
ఆ మాట విన్న పరమేశ్వరుడు తన కోపాన్ని ఇతరులలోకి ప్రవేశ పెట్టి పార్వతీదేవిని సంతోపెట్టాలనుకున్నాడు.
ఆ తర్వాత ఒకానొక సమయంలో త్రిమూర్తులు అనసూయ దేవికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా….ఆ మహా సాధ్వి ‘ మీ ముగ్గురి దివ్యాంశలతో నాకు బిడ్డలు కలగాలి.
’ అనే వరం కోరుకుంది.ఆ విధంగా బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించారు.
మరి పరమేశ్వరుడు తనకు వచ్చిన ఆగ్రహాన్ని అనసూయదేవి లో ప్రవేశపెట్టగా అనసూయ దేవికి దుర్వాసుడు జన్మించాడు.ఆ విధంగా దుర్వాసమహర్షి పుట్టడంతోనే ఎంతో కోపోద్రిక్తుడై జన్మించడం వల్ల అతనికి ఎక్కువ కోపం ఉండేదని పురాణాలు చెబుతున్నాయి.