మనదేశంలో బుల్లితెర కార్యక్రమాలకు వున్న డిమాండ్ ఏపాటిదో అందరికీ తెలిసినదే.ఇక్కడ మహిళలు దాదాపుగా టీవీలలో వచ్చే సీరియళ్లు కనులార్పకుండా తిలకిస్తారు.
ఇక ఇళ్ళదగ్గరున్నవారు అయితే పగలు రాత్రి అనే తేడాలేకుండా సినిమాలు, సీరియళ్లు చూస్తూ వుంటారు.ఈ క్రమంలోనే అనేక బుల్లితెర షోస్ ఇక్కడకి దిగుమతి అవుతూ ఉంటాయి.
ఇక అసలు విషయానికొస్తే, స్మార్ట్ ఫోన్ వాడకం అనేది ఇపుడు పరిపాటిగా మారింది.దాంతో టీవీ షోలు కూడా స్మార్ట్ ఫోన్లో వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసారు మనవాళ్ళు.
ఫోన్లోకే బుల్లితెర షోలు వచ్చినట్లైతే ప్రయాణాల్లో కూడా ఎంచక్కా చేసుకోవచ్చనే ఐడియా వచ్చిందేమో.అన్నిరకాల టీవీ కార్యక్రమాలనూ నేరుగా సెల్‌ఫోన్‌కే ప్రసారం చేసే విధానం త్వరలోనే ఇక్కడ అందుబాటులోకి వస్తుంది.
ఐతే ముందుగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని దేశ రాజధాని ఢిల్లీలో అమలుచేస్తామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర గురువారం తెలిపారు.ఇది దాదాపు ఎఫ్ఎం రేడియోలాగే పనిచేస్తుంది.
అందులో రేడియో ఫ్రీక్వెన్సీని అందుకునేందుకు ఒక రిసీవర్ ఉంటుంది.బ్రాడ్‌బ్యాండ్, బ్రాడ్కాస్ట్ సాంకేతికతలను కలిపి మొబైల్ ఫోన్లలో డిజిటల్ టీవీ కార్యక్రమాలు అందుకునేలా చేస్తారన్నమాట.

దాంతో తేలికగా స్మార్ట్ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్ నేరుగా చేరుతుంది.ఈ విషయమై భారతీయ పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ‘బిగ్ పిక్చర్ సమిట్’లో మాట్లాడుతూ, టీవీ ప్రసారాలు నేరుగా సెల్‌ఫోన్‌కు అందితే వీక్షకుల సంఖ్య కొన్ని రెట్లు పెరుగుతుందని అపూర్వ చంద్ర ఈ సందర్భంగా పేర్కొన్నారు.కాగా ప్రస్తుతం దేశంలో 20 కోట్ల టీవీలు ఉన్నాయి.అయితే స్మార్ట్ఫోన్లు మాత్రం 60 కోట్లుండగా 80 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉండటం కొసమెరుపు.అందువల్ల టీవీ మీడియా ప్రజలకు మరింత చేరువ అవుతుంది అని అభిప్రాయపడుతున్నారు.