ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది.ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు రాష్ట్ర ప్రజలు ఉగాది పండుగను జరుపుకుంటారు.
ఉగాది పండుగను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పేర్లతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఉగాది పండుగ ప్రతి సంవత్సరం వసంత కాలంలోనే వస్తుంది.
సాధారణంగా కొత్త సంవత్సరం అంటే అందరూ ఇంగ్లీష్ నెలలు గుర్తుపెట్టుకుంటారు.కానీ అసలు సిసలైన కొత్త సంవత్సరం అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు అసలైన కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది.ఎంతో పవిత్రమైన ఈ ఉగాది పండుగ రోజు ఎటువంటి పనులను చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
ఉగాది పచ్చడి:

ఉగాది పండుగ అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి.ఈ పండుగకు ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకం.షడ్రుచులతో ఈ పచ్చడిని తయారు చేసుకుకి దేవుడికి నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులందరూ మహా ప్రసాదంగా స్వీకరిస్తారు.మన జీవితంలో వచ్చే సంతోషాలు, దుఃఖాలకు ప్రతీకగా ఉగాది పచ్చడిని భావిస్తారు.
పంచాంగ శ్రవణం:

ఉగాది పండుగ రోజు కొత్త సంవత్సరం ఆరంభం కావడంతో ప్రతి ఒక్కరు వారి, రాశి నక్షత్రం ఆధారంగా వారి భవిష్యత్తు ఏ విధంగా ఉందో చూసుకుంటారు.ఈ పండుగ రోజు వేద పండితులు సైతం పంచాంగ శ్రవణం చేసి వినిపిస్తారు.పంచాంగ శ్రవణం ద్వారా ఆ ఏడాదిలో కలిగే మంచి చెడు విషయాలను ముందుగానే తెలుసుకుని అదేవిధంగా వ్యవహరిస్తారు.
కవి సమ్మేళనం:

పూర్వకాలంలో ఉగాది పండుగ రోజు కవులందరూ కలిసి ఒకచోట చేరి కవిసమ్మేళనం జరుపుకునేవారు.ఈ విధంగా వారి కలం నుంచి జాలువారిన ఈ పద్యాలను కవితలను అందరికీ వినిపించేవారు.
ఉగాది పూజ:

ఉగాది పండుగ రోజు ఉదయం నిద్ర లేచి తలంటు స్నానం చేసి ,వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఉగాది పండుగ రోజు నిర్వహించే పూజలో ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ విధంగా ఉగాది పండుగను ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.