హర హర మహాదేవ, శంభో శంకర సిద్దేశ్వర మహారాజ్ కీ జై అన్న భక్తుల జయ జయ ధ్వనుల మధ్య సిద్దేశ్వరుని బ్రహ్మ రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు.స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారి బ్రహ్మరథోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు.
గురువారం ఉదయం నుంచి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని వివిధ రకాల పూల మాలలతో అలంకరించి మేళ తాళాల మధ్య రథం పై స్వామి వారిని కొలువు దీర్చారు.
ప్రత్యేక పూజలు అనంతరం అశేష భక్తజన సమూహం మధ్య ఓం నమః శివాయా, సిద్దేశ్వర మహారాజ్ కి జై అంటూ భక్తులు రథోత్సవాన్ని ముందుకు కలిపారు.ఈ సందర్భంగా అరటి పండు, బెల్లం, కొబ్బరికాయ, పూలు, మిరియాలు తదితర వాటిని రథం పైకి భక్తులు విసిరి మొక్కులు తీర్చుకున్నారు.
కర్ణాటక నుంచి వచ్చిన గురువులు చేసిన వీరగాసే నృత్యం భక్తులందరినీ ఆకట్టుకుంది.ఉమ్మడి అనంతపురం జిల్లా తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలిరావడంతో హేమావతి గ్రామం భక్తులతో నిండిపోయింది.తిను బండరాలా దుకాణాలు,ఆటవస్తువుల అంగళ్లు రద్దీగా మారిపోయాయి.

ఇంకా చెప్పాలంటే దేవాలయ కమిటీ చైర్మన్ మంజునాథ, ఈవో నాగేంద్ర ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా బ్రహ్మరథోత్సవం నిర్వహించారు.సిఐ సురేష్ కుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.అమెరికాలో స్థిర పడిన విజయ లక్ష్మి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.