తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సాయిబాబా ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని, అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా జరగాలని, విజయదశమిని ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఆకాంక్షించారు.హైదరాబాద్, ఉప్పల్ లోని చిలుకా నగర్ లో గల సాయిబాబా దేవాలయంలో స్వర్ణ సింహాసనాన్ని నేడు స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారితో కలిసి మంత్రిగారు ఆవిష్కరించారు.
స్వామివారికి దాదాపు 80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బంగారు సింహాసనాన్ని ఆవిష్కరించడం నిజంగా అదృష్టమన్నారు.దేవాలయ కమిటీ సభ్యులు తమ ఇంటి పనికంటే ఎక్కువగా భావించి చేయడం వల్లే అతి తక్కువ సమయంలో స్వామివారికి ఈ సింహాసనం తయారైందన్నారు.
చిలుకానగర్ లో ఉంటున్నప్పటి నుంచి స్వామివారి భక్తురాలుగా పూజలు చేస్తున్నానని, స్వామివారి ఆశీస్సులతో అనుకున్నవి దిగ్విజయంగా జరుగుతున్నాయన్నారు.కార్పోరేటర్ ఎన్నికల్లో గీతా ప్రవీణ్ విజయం కోసం స్వామివారి ఆశీస్సులు తీసుకునే ప్రచారం ప్రారంభించామని, విజయం పొందామన్నారు.
ఆలయంలో నిత్యాన్నదానం చేస్తూ, విశిష్టపూజలు జరుపుతున్న అర్చక స్వాములందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు.

ఎంపీ సంతోష్ గారు ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్- జమ్మిచెట్టు పిలుపుమేరకు దేవాలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ శ్రీమతి బన్నాల గీతా ప్రవీణ్, దేవాలయ కమిటీ అధ్యక్షులు మధుకర్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.