ప్రస్తుతం నెట్టింట ఓ హార్ట్ టచింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. టర్కీలోని బెయిలిక్డుజు ఆల్ఫా వెటర్నరీ క్లినిక్‌లో(Beylikduzu Alfa Veterinary Clinic in Turkey) జనవరి 13న జరిగిన ఈ ఘటనలో ఓ తల్లి కుక్క (Mother Dog)తన స్పృహలేని పిల్లను నోట కరుచుకుని ఆసుపత్రికి వచ్చింది.
ఈ వీడియో చూసి నెటిజన్లు తమ గుండె తరుక్కుపోతుందని కామెంట్లు చేస్తున్నారు.
వీడియోలో కనిపించినట్లు ఆ తల్లి కుక్క(Mother Dog) ఎవరి సహాయం కోసం ఆగలేదు.
తన కుక్కపిల్లను (Puppy)నోట్లో పెట్టుకుని నేరుగా వెటర్నరీ క్లినిక్(Veterinary clinic)తలుపుల వద్దకు వచ్చింది.పిల్ల పరిస్థితి ఎంత విషమంగా ఉందో గుర్తించిందేమో, అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తనే చొరవ తీసుకుంది.
దీంతో కుక్కకూనకు వెంటనే వైద్య సహాయం అందే అవకాశం దక్కింది.
ఆ క్లినిక్‌లోని వెటర్నరీ డాక్టర్లు ఆ తల్లి కుక్క తెగువ చూసి ఆశ్చర్యపోయారు.
తలుపు దగ్గర కుక్కను గమనించిన వెంటనే సిబ్బంది ఒకరు తలుపు తెరిచారు.వెటర్నరీ డాక్టర్ బటురాల్ప్ డోగన్(Veterinary Doctor Baturalp Dogan) ఈ ఘటన గురించి వివరించారు.
వారి సహోద్యోగి ఎమిర్ మొదట ఆ తల్లి కుక్కను చూశారట.సాధారణంగా కుక్కలు అలా ప్రవర్తించడం అరుదు కాబట్టి, మొదట్లో ఎమిర్‌కు ఏం జరుగుతుందో అర్థం కాలేదట.
పిల్ల కుక్క కదలికలు లేకుండా, మంచులా చల్లగా ఉండటంతో అది చనిపోయి ఉంటుందని వారంతా భయపడ్డారు.
కానీ, ఆ పిల్లను పరీక్షించగా చాలా నెమ్మదిగా గుండె కొట్టుకోవడం గుర్తించారు.డోగన్ ప్రకారం, ఆ చప్పుడు ఎంత స్వల్పంగా ఉందంటే స్టెతస్కోప్‌తో కూడా వినిపించలేదట.చివరికి నీడిల్‌తో పరీక్షించగా, పిల్ల ఇంకా బతికే ఉందని తేలింది.
ఆ తల్లి చేసిన ప్రయత్నం వృథా పోలేదు.
చివరికి ఆ వెటర్నరీ డాక్టర్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ పిల్లను బతికించగలిగారు.ఇప్పుడు ఆ పిల్లకు స్పృహ వచ్చింది.తల్లి కుక్క, మరో తోబుట్టువుతో కలిసి క్లినిక్‌లోనే కోలుకుంటోంది.
మొత్తం ఆరు పిల్లలు పుట్టగా ఇవి మాత్రమే బతికాయి.ఆ తల్లి ప్రేమ, సంరక్షణ నిజంగా గ్రేట్ కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఈ ఘటన క్లినిక్ సిబ్బందినే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను కదిలించి వేసింది.“ఇది కదా మాతృత్వం అంటే” అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.