గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సబ్ సెంటర్ ల వారీగా సమీక్ష నిర్వహించారు.

 Special Attention Should Be Given To High Risk Cases Among Pregnant Women Distri-TeluguStop.com

ఆరోగ్య కేంద్రం పరిధిలో సబ్ సెంటర్ల వారీగా గర్భిణీ స్త్రీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత డెలివరీలు, క్షయ , షుగర్, తైరాయిడ్ వ్యాధి బాధితుల గుర్తింపు, తదితర అంశాలను ఏఎన్ఎం లను అడిగి తెలుసుకున్నారు.గత నెలలో ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎంత మంది గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించారు అనే వివరాలను కలెక్టర్ ఆరా తీయగా, ఫిబ్రవరి లో 22 ప్రభుత్వ, 5 ప్రైవేట్ దవాఖానలో, మార్చిలో ఇప్పటిదాకా 23 ప్రభుత్వ, 3 ప్రైవేట్ దవాఖానలో అయినట్లు కలెక్టర్ కు మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ.ఎన్.ఎం లు వారి ఆశా వర్కర్లతో సమన్వయం చేసుకుని క్షేత్ర స్థాయిలో గర్భవతుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

గర్భవతుల నమోదు పై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రసవాలన్నీ  ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడాలన్నారు.

ముఖ్యంగా హైరిస్క్ కేసులకు అధిక ప్రాధాన్యతనిచ్చి, బాధిత గర్భిణీలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు జిల్లా ఆసుపత్రికి దగ్గరుండి తీసుకురావాలని సూచించారు.రక్తహీనత లోపాన్ని నివారించేందుకు పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకునేలా గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించాలని అన్నారు.

క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స, మందులు అందించాలని ఆదేశించారు.హై రిస్క్ కేసులు చూసేందుకు నోడల్ అధికారి ని నియమించాలని, ఆ గర్భిణీలకు వైద్యం, మందులు, కౌన్సెలింగ్ ఇప్పించాలని,

ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.

ప్రతీ గర్భిణి కీ హిమోగ్లోబిన్, హెచ్ఐవీ, హెపటైటిస్, బ్లడ్ గ్రూప్, థైరాయిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు.అలాగే మానసిక ఒత్తిడి ఇతర ఇబ్బందులు పడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు.

అనంతరం కలెక్టర్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ఫిజియోథెరపీ చికిత్స అందించే పరికరాలు పరిశీలించి, ఎంత మందికి సేవలు అందిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు.పీ హెచ్ సీలోని మందులు ఇచ్చే గదిని పరిశీలించారు.

వైద్యులు, సిబ్బందికి అభినందన గత నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా కృషి చేసిన ఇల్లంతకుంట మెడికల్ ఆఫీసర్,ఏ.ఎన్.ఎం లు, వైద్య సిబ్బందిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.సమీక్షలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, ఉప వైద్యారోగ్య అధికారులు డా.శ్రీరాములు, డా.రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ లు ఉమ, నయీమ్ జహా, మెడికల్ ఆఫీసర్ శరణ్య తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube