సోమవారం నుంచి మనకు శ్రావణమాసం మొదలవుతుంది.శ్రావణ మాసాన్ని హిందువులకు ఎంతో పవిత్రమైన మాసంగా వ్యవహరిస్తారు.
ఈ శ్రావణ మాసంలో మహిళలు వివిధ రకాల పూజలు, నోములు వ్రతాలు చేస్తుంటారు.అదేవిధంగా శ్రావణమాసం అంటే ఆ పరమశివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమ శివునికి పూజ చేయడంవల్ల స్వామి అనుగ్రహం మనపై ఉంటుందని భక్తులు భావిస్తారు.ఈ క్రమంలోనే పరమేశ్వరుడిని వివిధ రకాల పుష్పాలతో పూజిస్తారు.
మరి శివునికి ఏ పుష్పాలతో పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
శంకు పుష్పాలు, తామర పువ్వులు,లేదా బిల్వదళాలతో స్వామి వారిని పూజించడం వల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెందుతారు.
ఈ విధమైనటువంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల మన పాపాలు తొలగిపోయి లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు.పారిజాత పుష్పాలతో స్వామి వారికి పూజ చేయటం వల్ల మన సంపద వృద్ధి చెందుతుంది.
ఆ పరమేశ్వరుని అనుగ్రహం, కృప మనపై ఉండాలంటే స్వామివారికి పారిజాత పుష్పాలను సమర్పించాలి.
వారు కోరుకున్న వరుడు,వధువుతో వివాహం జరగాలంటే శివునికి గుండ్రని మల్లె పూలతో పూజించాలి.ఈ మల్లె పూలతో పూజించడం వల్ల కోరుకున్న వారితో వివాహం జరుగుతుంది అలాగే ఆహారానికి ఎలాంటి కొరత ఏర్పడదు.శమీ పత్రంతో స్వామివారికి పూజ చేయటం వల్ల మోక్షం సిద్ధిస్తుంది.
జిల్లేడు పుష్పాలతో స్వామివారికి పూజ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.జిల్లేడు పుష్పాలతో పూజ చేయటం వల్ల మన ఇంట్లోకి క్రిమి కీటకాల ప్రవేశానికి ఆస్కారం ఉండదు.
ఈ విధంగా స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో పూజ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి.అయితే స్వామి వారికి ముఖ్యంగా తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో పూజ చేయటం ఎంతో శుభప్రదం.