అమెరికా వాసులకు ప్రకృతి విపత్తులు ఎదుర్కోవడం కొత్తేమి కాదు.టొర్నడోలు, తుఫానులు, వరదలు ఇవన్నీ అక్కడి ప్రజలకు చుట్టం చూపుగా వచ్చి పలకరించి వెళ్ళిపోతాయి.
అయితే తాజాగా అమెరికాపై మరోసారి ప్రకృతి పగ పట్టిందా అన్నట్టుగా ఉంది అక్కడి తాజా పరిస్థితి.ప్రస్తుతం ఇయాన్ హరికేన్ అక్కడి ప్రాంత వాసులను గజగజ వణికిస్తోంది.
అత్యంత బలమైన గాలులతో విరుచుకుపడుతున్న ఈ తుఫాన్ మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు ప్రకటించడంతో అమెరికా అధ్యక్షుడు బిడెన్ రంగంలోకి దిగారు.పూర్తి వివరాలలోకి వెళ్తే.
ఇయాన్ హరికేన్ అమెరికాలోని ఫ్లోరిడాపై విరుచుకుపడుతోంది.ప్రమాదకరమైన గాలులతో గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.ఈ పరిస్థితిని అంచనా వేసిన నిపుణులు ఫ్లోరిడా ద్వీపకల్పంలో తుఫాన్ కారణంగా బలమైన గాలులు వీస్తూ అతిపెద్ద వరద ముప్పు కలిగించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.దాంతో అధ్యక్షుడు జో బిడెన్ అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ తుఫాన్ తీరాన్ని తాకేలోగా అక్కడ ఉన్న 2.5 మిలియన్ ప్రజలు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హెచ్చరించారు.

నైరుతి ఫ్లోరిడా సమీపంలో 4 వ తుఫాను హెచ్చరికను జారీ చేశారు.ఈ తుఫాను ఈశాన్య ఫ్లోరిడా, జార్జియా, కరోలినా తీరాలను చేరుతుందని అంచనా వేసారు.తుఫాను తీవ్రత అత్యధికంగా ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.దాంతో కమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బతింది.ఇదిలాఉంటే ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ అక్కడి తాజా పరిస్థితిపై స్పందించారు.గవర్నర్ రాన్ డిసాంటిస్ మాట్లాడుతూ ఇయాన్ రాష్ట్రంపై ప్రభావం చూపుతున్న నేపధ్యంలో హై అలెర్ట్ ప్రకటించినట్టుగా తెలిపారు.
కాగా తుఫాను కారణంగా ఫ్లోరిడా తీరంలో పడవ మునిగోపోయిందని ఈ పడవలో సుమారు 23 మంది వలస దారులు ఉన్నారని వారికోసం కోస్ట్ గార్డ్ లు వెతుకుతున్నారని అధికారులు తెలిపారు.