ప్రజా పాలన సేవ కేంద్రాల ద్వారా గ్యారెంటీ పథకాల లబ్ధిదారుల ఎంపిక కొరకు అవసరమైన డాక్యుమెంట్లు సేకరించి ప్రజాపాలన సాఫ్ట్ వేర్ లో నమోదు చేయాలని విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ నుండి విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు, సాఫ్ట్ వేర్ లో వివరాల నమోదు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి గ్యారెంటీ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, ప్రతి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో, అదేవిధంగా మున్సిపాలిటీలలో అవసరమైన మేర ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రజా పాలన కార్యక్రమం కింద క్షేత్రస్థాయి నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేశామని, తెల్ల రేషన్ కార్డు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలు లింక్ ఉన్న దరఖాస్తుదారులకు ఇప్పటికే ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తుందని అన్నారు.
గృహ జ్యోతి కింద ఎంపికైన లబ్ధిదారులకు జీరో బిల్లులు పంపిణీ చేస్తున్నామని, ప్రజా పాలన దరఖాస్తు సమయంలో వివరాలు సరిగ్గా నమోదు చేసుకొని దరఖాస్తుదారులు, నూతన ప్రజా పాలన దరఖాస్తుల సైతం ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా సమర్పించవచ్చని ఆయన తెలిపారు.ప్రజలు తమ తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నెంబర్ , విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలను తీసుకుని వచ్చి ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా గృహ జ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలలో తమ అర్హతను పరిశీలించి అర్హులు వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రజా పాలన సేవా కేంద్రాల్లో వినియోగించే సాఫ్ట్వేర్ పనితీరును రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
లబ్ధిదారుల ఆధార్ కార్డు/తెల్ల రేషన్ కార్డు వివరాల ద్వారా ప్రజా పాలన దరఖాస్తును గుర్తీంచాలని, అనంతరం తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నెంబర్/విద్యుత్ మీటర్ నెంబర్ మ్యాచ్ ఐతే సదరు లబ్ధిదారులను గ్యారంటీ పథకాల కింద ఎంపిక చేసామని, వివరాలు మ్యాచ్ కాని పక్షంలో మరోసారి సరైన వివరాలు నమోదు చేయాలని అన్నారు.
తెల్ల రేషన్ కార్డు వివరాలను ముందుగా వ్యాలిడేట్ చేయాలని, ముందస్తుగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారినిగా గుర్తించిన తర్వాత సదురు దరఖాస్తుదారులు అందించే గ్యాస్ కనెక్షన్ నెంబర్ వివరాలు, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలు వ్యాలిడేట్ చేయాలని అన్నారు.
ఒక తెల్ల రేషన్ కార్డు పై ఒక గ్యాస్ కనెక్షన్, ఒక విద్యుత్ మీటర్ కనెక్షన్ కు మాత్రమే గ్యారెంటీ పథకాలు వర్తిస్తాయని అన్నారు.
ప్రజా పాలన సేవా కేంద్రాలలో అవసరమైన మేర దరఖాస్తులు అందుబాటులో ఉండాలని, ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు పై విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రజాపాలన సేవా కేంద్రాలో విధుల నిర్వహణ, సాఫ్ట్ వేర్ లో వివరాల నమోదుపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని ఆయన కలెక్టర్ లకు సూచించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పి.గౌతమి,తదితరులు పాల్గొన్నారు.