దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ అప్పులపైనే చర్చ 151 సీట్లు కట్టబెట్టినా సుపరిపాలన లేదు కోడి కత్తి కేసు… వివేకానందరెడ్డి హత్య కేసులు ఎందుకు తేల్చరు? ఆ కేసుల్లో అలసత్వమే నేరగాళ్లకు ధైర్యమిచ్చింది అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చవద్దన్నారాష్ట్రంలో పరిస్థితులన్నీ ఢిల్లీ పెద్దలకు తెలుసునా విధానాలకు మద్దతు ఇవ్వడం ఇవ్వకపోవడం బీజేపీ ఇష్టం ఎన్నికల్లో పొత్తులపై ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా చేయలేదు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
లక్షల కోట్లు దేశాలు దాటించే తెలివితేటలు ఉంటాయి.అదే లక్ష కోట్లు వెచ్చించి జనాలకు మేలు చేసే అంశం మీద మాత్రం శ్రద్ద పెట్టరని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు.
ప్రజలు కూడా ఈ అవినీతి అక్రమాలను ప్రశ్నించలేకపోతున్నారన్నారు.రానున్న ఎన్నికల్లో పొత్తుల అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా చేయలేదని, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో మాత్రమే కలసి నడుస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని భావిస్తున్నట్టు తెలిపారు.శుక్రవారం రాత్రి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా మిత్రులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలతోపాటు పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు పాత్రికేయులతో పంచుకున్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.
.”దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి పైనే చర్చ నడుస్తోంది.ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పు పుట్టని పరిస్థితికి తీసుకువెళ్లారు.ఢిల్లీ పెద్దల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది.అందుకే ఆంధ్రప్రదేశ్ ని శ్రీలంకతో పోలుస్తూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఆ అంశాలను చూసే నేను ట్వీట్ చేశాను.
ప్రజలు నమ్మి 151 సీట్లు కట్టబెడితే రాష్ట్రంలో సుపరిపాలన అనేది మచ్చుకైనా కనబడుతుందా? బలం ఉంది కదా ఏం చేసినా చెల్లిపోతుంది అంటే ఎలా కుదురుతుంది.వైసీపీ విధానాల వల్లే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని వ్యాఖ్యలు చేశారు.
శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ఉండాలి.
ఒక సమస్య వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడడం కుదురుతుంది.నల్లమల యురేనియం తవ్వకాలను అడ్డుకునే విషయంలో అది సాధ్యపడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు.నా విధానాలకు మద్దతు ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది బీజేపీ ఇష్టం.
నా అభిప్రాయాలు మాత్రం స్పష్టంగా బీజేపీ పెద్దలకు వివరిస్తాను.రాష్ట్రంలో క్షీణించిన ఆర్ధిక పరిస్థితి గురించి, శాంతి భద్రతలు, అస్థవ్యవస్థ పరిపాలన, తదితర అధ్వాన్న పరిస్థితుల్ని బీజేపీ నేతలకు తెలియచెప్పాను.
బీజేపీ విధానాలు ఎలా ఉన్నా నా నిర్ణయంపై వారి స్పందన సానుకూలంగానే ఉంటుందన్న నమ్మకం ఉంది.నేను మోడి గారితో, జాతీయ స్థాయి నాయకులతో బాగా కనెక్ట్ అవుతా.
వారితో నేను మాట్లాడే అంశాలు కూడా జాతీయ స్థాయిలోనే ఉంటాయి.రాష్ట్రంలోనూ బీజేపీతో కలిసే పని చేస్తున్నాం.
ఇరు పార్టీల మధ్య పొత్తు ఏర్పడిన తర్వాత వెంటనే ఢిల్లీ ఎన్నికలు, తర్వాత కరోనా, మిగిలిన రాష్ట్రాల ఎన్నికలు ఇలా షెడ్యూల్ కుదరకపోవడం వల్ల కొన్ని సమావేశాలు జరగలేదు.చిన్నపాటి ప్రణాళికా బద్దమైన లోపాలు ఉన్నా కూర్చుని మాట్లాడుకుంటే పరిస్థితులు సర్ధుకుంటాయి.
నేను ఏదైనా విశాల దృక్పదంతో ఆలోచిస్తా.బీజేపీకి జాతీయ స్థాయిలో మంచి బలం ఉంది.
*
రాజధాని రైతుల విషయంలో బీజేపీ సానుకూలం
రాజధాని విషయంలో బీజేపీ అధిష్టానంతో మాట్లాడినప్పుడు రైతులకు అండగా నిలిచారు.స్టీల్ ప్లాంట్ అంశం మీద కూడా మా వాదన బలంగా వినిపించాం.
రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు, అధ్వాన్న పరిస్థితి కేంద్ర పెద్దలకు కూడా తెలుసు.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద కేంద్రం జోక్యం చేసుకోదని వారు అంటున్నారు.
విద్యుత్ కొనుగోళ్లు, తదితర అంశాలు కూడా కేంద్ర పెద్దలకు వివరించా, బీజేపీ, జనసేన సమావేశాల్లో కూడా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగింది.
* కియా వ్యవహారంతో పెట్టుబడిదారుల్లో అభద్రత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే విదేశీ సంస్థలు ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద అధ్యయనం చేస్తాయి.
ఏ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి సురక్షితమో చూసుకుంటాయి.ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో అన్ని విషయాల మీద సమగ్రంగా విచారించి ఆ రిపోర్టుల తర్వాత పెట్టుబడులు పెడతారు.
ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటులో రాజకీయ ప్రమేయం ఉండరాదు.ఎన్ని పర్యటనలు చేసినా ఆ సంస్థలకు నమ్మకం కలిగించలేనప్పుడు ఉపయోగం ఉండదు.
కియా వ్యవహారంతో రాష్ట్రం ఇన్వెస్టిమెంట్ ఫ్రెండ్లీ కాదు అన్న భావన వచ్చేసింది.పెట్టుబడిదారుల్లో అభద్రత వచ్చింది.
రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునే వ్యక్తిగా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.అయితే పెట్టుబడులు పేపర్ల మీద సంతకాలకే పరిమితం కాకూడదని కోరుకుంటున్నా.
ఆ సంతకాలు కార్యరూపం దాల్చినప్పుడు పరిశ్రమలను స్వాగతిస్తా.విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఇప్పటికే బీజేపీ పెద్దలకు వివరించాను.
ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కేంద్రానికి బాధ్యత ఉంది.నేను చెప్పిన అంశాలను బీజేపీ అధిష్టానం విశ్వసిస్తుందని నమ్ముతున్నాను.
*
రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించారా?
రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశం మీద మాకు స్పష్టత ఉంది.జనసేన, బీజేపీ కలసే జనాల్లోకి వెళ్తాం.
పొత్తుల అంశం గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు.నేను ఎప్పుడు ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రయోజనాలకు లోబడి మాత్రమే ఆలోచించి మాట్లాడుతాను.
రూట్ మ్యాప్ అనే మాట కూడా ఇరు పార్టీల పొత్తు ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశం మీద మాత్రమే ఉంటుంది.అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం.
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం జరిగింది.సగటు వ్యక్తిగా విభజన ఇబ్బంది కలిగించడం, నాయకుల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగానే జనసేన పార్టీ స్థాపించా.
ఇక్కడ నాయకులు ఎవ్వరూ హక్కుల గురించి, హామీల గురించి మాట్లాడరు.వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడరా? ఆ దిశగా ఆలోచన చేశారా? ఆంధ్రప్రదేశ్ లో 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఉన్నా ఇలా జరగడం బాధ కలిగించింది.అలాంటి సమయంలో నేను బాధితుల గొంతుకు అవ్వాలనుకున్నా.ఉదయం హైదరాబాద్ లో ఓ ఆడపడుచు మాటలు నాకు ఆవేదన కలిగించాయి.కరోనా కారణంగా రెండు సవంత్సరాలు వయసు పెరగి ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో జీవితాలు చిందరవందరయ్యాయి.అలాంటి పరిస్థితులపై చర్చ జరగాలి.
*
కౌలు రైతుల కోసం ప్రత్యేక విధానం
రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చివరికి జనసేన పార్టీ చేస్తున్న సాయాన్ని కూడా విమర్శించే స్థాయికి వెళ్లారు.మీరు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వరు.
కౌలు రైతు భరోసా యాత్రలో వారి కుటుంబాలను పరామర్శించినప్పు డు కష్టాలు చూసి బాధ కలిగింది.ఎక్కడికి వెళ్లినా కౌలు రైతుల కన్నీరు నన్ను కలచి వేశాయి.
నావంతు బాధ్యతగా భావించి వారికి సాయం అందిస్తున్నా.భూమి ఉన్న యజమానికి ఇబ్బంది కలగకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
కౌలు రైతుల గురించి ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉండాలి.జనసేన ఆ కోణంలో ఆలోచన చేస్తుంది.
భారత దేశం మొత్తం అది అమలు చేయాల్సిన అవసరం ఉంది.
*
వైసీపీ చెప్పేదొకటి చేసేదొకటి
రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే పథకాలు చాలా వరకు నిలిపివేశారు.
సీపీఎస్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది.లక్ష కోట్లు దేశం దాటించే తెలివితేటలు ఉన్నవారు సీపీఎస్ రద్దు చేయలేరా? వాస్తవంగా సీపీఎస్ రద్దుకు చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుంది.జనసేన పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పాం.ఒక మాట చెబితే అది శాసనంగా భావించాలి.వైసీపీ నాయకులు మాత్రం చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది.సమస్య మీద చర్చించినప్పుడు ఖచ్చితంగా దానికి బలమైన పరిష్కారం దొరుకుతుంది.
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మాట తప్పిన రాజకీయ నాయకుల్ని బాధ్యుల్ని చేసినప్పుడే అది సాధ్య పడుతుంది.ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో జవాబుదారితనం కొరవడింది.
నాతో సహా ఎవరు ఇచ్చిన హామీ నెరవేర్చ కున్నాచర్యలు ఉండాలి.సీపీఎస్ రద్దు టెక్నికల్ గా కాదు అని ఎలా చెబుతారు.
రాజస్థాన్, చత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే రద్దు చేశాయి.రాష్ట్రం సమస్యల పుట్టగా మారింది.
ఈ రోజు ఒక సమస్య మీద మాట్లాడితే.రేపటికి మరో కొత్త సమస్య ప్రత్యక్షం అవుతుంది.
మద్య నిషేధం హామీ ఇచ్చారు ఇప్పుడు అమ్ముతున్నారు.రాష్ట్ర విభజన దగ్గర నుంచి రాజకీయ నాయకులు వ్యక్తిగత లాభం కోసం మాత్రమే పని చేస్తున్నారు.
విభజన దగ్గర నుంచి నాయకుల విధానాలకు ప్రజలు విసిగిపోయారు.ఈ విషయంలో ఎవరి లెక్కలు వారివి.
ఎలాంటి నిర్ణయం తీసుకునా దాని వల్ల ప్రజలు బాగుపడతారా లేదా అన్నదే ఆలోచించాలి.సీనియర్ నాయకులు, మేధావులు అందరూ కూర్చుని రాష్ట్రం లో పరిస్థితి చర్చించాలి.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వైసీపీకి ఓటు వేయడం ఎంత వరకు కరక్టు అనే విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాలి.నేను చేసిన ఐదు పదాల మాట వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చరాదు అన్న వ్యాఖ్యకు వైసీపీ వాళ్లు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు.
భయం లేదనుకుంటే నా వ్యాఖ్యలు వదిలేయవచ్చు కదా.
*
బ్యూరోక్రాట్స్ కి వాయిస్ లేదు… చాయిస్ లేదు
ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం డబ్బులు ఇస్తున్నట్టు వైసీపీ వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు.ఈ వ్యవహారంలో ఆర్ధిక పరమైన అంశాల్లో బ్యూరోక్రాట్స్ నలిగిపోతున్నారు.రాష్ట్రంలో పరిస్థితులు అధికారులకు వాయిస్ లేదు.చాయిస్ లేదు అన్న చందంగా ఉన్నాయి.సినిమా టిక్కెట్ల అంశాన్ని కూడా ప్రజలు పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు.
కోడి కత్తి విషయంలో నడిచిన డ్రామా అందరినీ ఆశ్చర్య పరిచింది.ఆ కేసులో నిందితుడికి ఏదో పదవి ఇచ్చారని కూడా ఈ మధ్య ప్రచారం జరిగింది.
శ్రీ వివేకానందరెడ్డి హత్య కేసు విషయాన్ని కూడా ఎన్నో మలుపులు తిప్పారు.ఈ రెండు కేసుల్లో దోషుల్ని మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు శిక్షించలేకపోయారు.
కోడి కత్తి, శ్రీ వివేకానందరెడ్డి హత్య కేసులను మీరు బాధ్యతగా తీసుకోవాలి.అలసత్వంగా ఉండటం నేరగాళ్లకు ధైర్యం ఇస్తోంది.
లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే క్రిమినల్స్ రెచ్చిపోతారు.క్రిమినల్స్ ను పట్టుకోకపోతే మీరే చేసుకున్నారని ప్రజలు నిర్ధారించుకుంటారు.
*
ఆ నాలుగు పదాలతో ఎందుకంత కంగారు
రాష్ట్రం బలంగా ఉంటే జనసేన పార్టీ బలంగా ఉంటుంది.జనసేన పార్టీలో చేరేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.
రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఒక నిర్ణయం తీసుకుంటా.నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తామన్న వైసీపీ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నా.
ఇప్పటి వరకు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశం మీద నిర్ణయం తీసుకోలేదు.విమర్శలు చేసిన మంత్రులు ఇప్పుడు ఏమయ్యారు.
బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి.ప్రజలకు సేవ చేయడం కన్నా నన్ను తిట్టడం మీదే కొంత మంది ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
దానికి ప్రజలే సమాధానం చెబుతారు.రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర ఉంటుంది.
అది ప్రజల హృదయాలకు దగ్గరయ్యే విధంగా చేస్తాను.ఎప్పుడు యాత్ర చేయాలన్న అంశం మీద నాకు స్పష్టత ఉంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే నాలుగు పదాలతో కూడిన వ్యాఖ్య చేయగానే వైసీపీ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు.ఎందుకు కంగారు పడుతున్నారు.
తెలంగాణలో కూడా జనసేన పార్టీకి మంచి ఆధరణ ఉంది.అక్కడ 30 సీట్ల వరకు పోటీ చేసే సత్తా ఉంది.15 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే మార్పు ప్రజల్లోనూ రావాలి” అన్నారు.
*
కరెంట్ కట్
ఇష్టాగోష్టి మధ్యలో జనసేన పార్టీ కార్యాలయంలో కరెంటు పోవడంతో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? పాత్రికేయులతో సమావేశం సమాచారం రావడంతో కరెంటు తీశారు, కాసేపు చీకట్లోనే చర్చను కొనసాగించి రాష్ట్రంలో పరిస్థితులు ప్రజలకు వివరిద్దాం అన్నారు.