భారతీయ అమెరికన్, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత స్వదేశ్ ఛటర్జీ( Swadesh Chatterjee ) అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా గవర్నర్ల బోర్డు(North Carolina University board of governors )లో చోటు దక్కించుకున్నారు.పోఖ్రాన్ 2 అణుపరీక్షల తర్వాత విధించిన ఆంక్షల ఎత్తివేత సహా భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో గత కొన్ని దశాబ్ధాలుగా స్వదేశ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా ఆయనను నార్త్ కరోలినా అసెంబ్లీ నియమించింది.
యూనివర్సిటీ గవర్నర్ల బోర్డులో ఆరుగురు ప్రముఖులను నియమించే తీర్మానాన్ని మే 3న రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.వీరి కాలపరిమితి ఈ ఏడాది జూలై 1 నుంచి జూన్ 30, 2027 వరకు వుంటుంది.గతేడాది అక్టోబర్‌లో నార్త్ కరోలినా గవర్నర్ రే కూపర్( Roy Cooper ) 75 ఏళ్ల స్వదేశ్ ఛటర్జీకి రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన ‘‘ఆర్డర్ ఆఫ్ ది లాంగ్ లీఫ్ పైన్’’ను అందజేశారు.
ఈ సందర్భంగా కూపర్ మాట్లాడుతూ.ఆయన నార్త్ కరోలినా అభివృద్ధికి మాత్రమే కాకుండా.ఇండో – యూఎస్ సంబంధాల బలోపేతానికి కృషి చేశారని ప్రశంసించారు.
2001లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్( Padma Bhushan ) అవార్డ్ అందుకున్న ఛటర్జీ… ఇండో- యూఎస్ ప్రభుత్వాలను మరింత దగ్గరకు చేర్చే కీలక ఘట్టాలకు కేంద్రంగా నిలిచారని భారత్‌లో అమెరికా మాజీ రాయబారి రిచ్ వర్మ కొనియాడారు.2000వ సంవత్సరం నుంచి భారత్- అమెరికా సంబంధాలు కొత్త మలుపు తిరిగాయని ఆయన అన్నారు.న్యూఢిల్లీతో సంబంధాలు మెరుగుపరుచుకునే నిమిత్తం 2000వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ భారత పర్యటనలోనూ స్వదేశ్ ముఖ్య భూమిక పోషించారని రిచ్ వర్మ చెప్పారు.
నాడు అమెరికా అధ్యక్షుడి వెంటే వుంటూ పర్యటన విజయవంతం కావడానికి ఛటర్జీ ఎంతో కృషి చేశారని ఆయన ప్రశంసించారు.ఇండో – యూఎస్ పౌర అణు ఒప్పందంలోనూ ఛటర్జీ కీలకపాత్ర పోషించారని… ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడం వెనుకా కృషి చేశారని రిచ్ వర్మ గుర్తుచేశారు.