గుడ్ ఫ్రైడే క్రైస్తవులు జరుపుకునే పండుగలలో ఇది ఒకటి.ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ను ఈస్టర్ కి రెండు రోజులు ముందు జరుపుకుంటారు.
ఈ ఏడాది గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 2న వచ్చింది.గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు భక్తుల పాపాల నుంచి విముక్తిని కలిగించడం కోసం సిలువ ఎక్కిన రోజుగా భావిస్తారు.
ఈరోజు యేసుక్రీస్తును సిలువ వేసిన రోజను స్మరించుకుంటూ శోకతప్త హృదయంతో క్రైస్తవులందరూ తపస్సు, ఉపవాసం ఉన్న రోజు.ఈ విధంగా యేసుక్రీస్తు సిలువ ఎక్కిన రోజు కావడంతో గుడ్ ఫ్రైడేను బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు.
ఇవి క్రైస్తవులకు 40 రోజుల ఉపవాస కాలం అని చెప్పవచ్చు.
గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు లోక రక్షణ కోసం సిలువ ఎక్కడంతో అందుకు గుర్తుగా క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తూ కొయ్యతో తయారు చేసినటువంటి సిలువను చర్చిలో ఉంచి ప్రత్యేక ప్రార్థనలతో పూజిస్తారు.
అదేవిధంగా గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులందరూ యధావిధిగా చర్చికి వెళ్లి మూడు గంటల వరకు సేవలలో పాల్గొంటారు.ఇందులో భాగంగా లోక రక్షణ కోసం యేసుక్రీస్తు చేసిన సిద్ధాంతాలను భక్తులకు వినిపించి వారి చేత కూడా చదివిస్తారు.
ఈ క్రమంలోనే మత పెద్దలు క్రీస్తును ఎలా శిలువ చేశారనే విషయంపై ఉపన్యాసాలు చేస్తారు.

ఈ విధంగా క్రీస్తు ఉపన్యాసాల అనంతరం అర్ధరాత్రి వరకు చర్చిలో క్రైస్తవులందరూ సామూహిక ప్రార్థనలతో క్రీస్తు తమ కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ప్రార్థిస్తారు.మరికొన్ని చోట్ల క్రైస్తవులందరూ నల్లటి వస్త్రాలు ధరించి క్రీస్తును స్మరిస్తూ ఒక సమారోహాన్ని ఏర్పాటు చేసుకుంటారు.అదేవిధంగా ప్రార్థనల అనంతరం కృత్రిమ అంతిమ సంస్కారం కూడా చేస్తారు.
క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు ప్రతి ఒక్కరు కూడా గుడ్ ఫ్రైడే రోజున ప్రాయశ్చిత్తం, ప్రార్థనలు చేసుకునే రోజు.ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో గంటలు మోగవు.