మన భారతదేశం ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయం అనే విషయం మనకు తెలిసిందే.ఎంతో మంది దేవ దేవతల ఆలయాలు కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తున్నారు.
అయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి.కొన్ని ఆలయాలలో స్వామివారీ విగ్రహాలు స్వయంభువుగా వెలసి ఉండగా, మరి కొన్ని ఆలయాలలో దేవదేవతల చేత ప్రతిష్టించబడి ఉన్నాయి.
మరికొన్ని ఆలయాలలో స్వామి వారి విగ్రహాలు ఋషులు, మునుల చేత ప్రతిష్టింపబడ్డాయి.ఈ విధంగా స్వయాన చంద్రుడి చేత ప్రతిష్టించబడిన విగ్రహాలలో వినాయకుడి విగ్రహం ఒకటి.
సాక్షాత్తు చంద్రుడు బెల్లం వినాయకుడిని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.అసలు ఈ బెల్లం వినాయకుడు ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం…
విశాఖపట్నం కొత్త జాలరి పేటలో ఎంతో ప్రసిద్ధి చెందిన బెల్లం వినాయకుడు ఆలయం ఉంది.ఈ ఆలయంలో స్వామి వారు ప్రత్యేక పూజలు అందుకుంటూ భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ ఆనంద గణపతిగా పూజలందుకుంటున్నారు.ఈ ఆలయంలో వెలసిన స్వామి వారిని సాక్షాత్తు చంద్రుడి ప్రతిష్టించారని ఇక్కడి ఆలయ పురాణం చెబుతోంది.
అన్ని వినాయకుడి విగ్రహాలతో పోలిస్తే ఈ ఆలయంలో వెలసిన స్వామి వారి రూపం ఎంతో భిన్నంగా ఉంటుంది.ఈ ఆలయంలో వెలసిన స్వామి వారి తొండం కుడి వైపుకు తిరిగి ఉంటుంది.
ఇక్కడ స్వామివారికి బెల్లం సమర్పించి భక్తులు భక్తితో ఏ కోరిక కోరినా నెరవేరుతుందని పెద్దఎత్తున భక్తులు విశ్వసిస్తారు.

ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహిస్తుంటారు.బెల్లం వినాయకుడుగా పేరు పొందిన స్వామివారికి చెరుకు గడలతో తయారుచేసిన బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి.ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి కేరళ తరహాలో తాంత్రిక పూజలందుకుంటాడని అక్కడి పూజారులు చెబుతున్నారు ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం పక్కనే రామలింగేశ్వర విగ్రహం కూడా ఉంది.
ఇక ఈ ఆలయంలో వినాయక నవరాత్రులలో మాత్రమే కాకుండా ప్రతి బుధవారం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారికి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తూ స్వామివారి పూజలో పాల్గొంటారు.