గత కొద్ది రోజులుగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారనే హడావుడి పెద్ద ఎత్తున చోటుచేసుకుంది.రాజగోపాల్ రెడ్డి సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఇక ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు తాము మునుగోడులో ఉప ఎన్నికలు వస్తే సిద్ధమే అన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు.రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరిపోతున్నట్లు ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.
అయితే అదిగో ఇదిగో అంటూ హడావుడి తప్ప రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.మరికొద్ది రోజుల పాటు ఇదే విధమైన నాన్చుడు ధోరణి తో రాజగోపాల్ రెడ్డి ఉండేలా కనిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరితే తమ పరిస్థితి ఏంటి అనేది మునుగోడు నియోజకవర్గ బిజెపి నాయకుల్లో టెన్షన్ మొదలైంది.
ఆయన బిజెపిలో చేరితే తమ రాజకీయ పరిస్థితి గందరగోళం లో పడుతుంది అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది.
సహజంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పార్టీలో చేరితే వారి వెంట చాలామంది నాయకులు వస్తారు.అలా వచ్చిన వారితో తనకు ఇబ్బందులు ఏర్పడతాయని, పదవుల్లోనూ ప్రాధాన్యతలలోనూ ఆయన అనుచరులకి పెద్దపీట వేస్తారని తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందనే ఆందోళన ఇప్పుడు మునుగోడు బిజెపి నేతల్లో మొదలైంది.
ముఖ్యంగా 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన గంగిరెడ్డి మనోహర్ రెడ్డి పరిస్థితి ఏమిటనే చర్చ ఇప్పుడు నియోజకవర్గం లో జరుగుతోంది.ప్రస్తుతం మనోహర్ రెడ్డి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాను, మునుగోడు బిజెపి ఇన్చార్జిగాను ఉన్నారు.

అయితే రాజగోపాల్ రెడ్డి చేరితే ఆయనకు ప్రాధాన్యం తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది.అయితే మనోహర్ రెడ్డి మాత్రం బిజెపి అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెబుతున్నా, తన అనుచరుల వద్ద మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి చేరిక వ్యవహారాన్ని పూర్తిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తూ ఉండడంతో, ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది.అయితే ఈ విషయంలో నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం ప్రాధాన్యత విషయంపై ఆందోళనలో ఉన్నారట.
రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరిన తర్వాత నియోజకవర్గస్థాయి నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులతో బిజెపి అధిష్టానం పెద్దలు సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట.