అధికార పార్టీపై ప్రతి పక్షం, ప్రతిపక్షం పై అధికార పార్టీ విమర్శలు చేసుకోవడం సర్వసధారణం.కానీ సొంత పార్టీ నేతలనే ప్రత్యర్థులుగా భావిస్తూ, వారి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటూ, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రమే కనిపిస్తుంది.
ఇక్కడ సీనియర్ నాయకులు సంఖ్యకు కొదవ లేకపోవడంతో ఎవరికి వారు తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.ఈ కారణాలతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చినా, 2014 నుంచి జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలు కావాల్సి వచ్చింది.
అయినా నేతల తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమించేందుకు పార్టీ అధిష్టానం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది.
నాయకుల మధ్య ఏర్పడిన గ్రూపు విభేదాల కారణంగా వాటిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.ప్రస్తుతం ఈ పదవిని భర్తీ చేసే విషయమే కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టిన క్రమంలో మళ్లీ సీనియర్, జూనియర్ నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి.
రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపిస్తూ, ఇప్పటికే పార్టీలోని నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఇందులో మెజారిటీ నాయకులు రేవంత్ పేరుని ప్రతిపాదించగా, కాంగ్రెస్ లోని సీనియర్లు మాత్రం రేవంత్ పేరును వ్యతిరేకిస్తున్నారు.
దీనికి కారణం పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడమే.భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి , శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతో మంది నేతలు ఈ పదవికి పోటీ పడుతున్నారు.
ఇక కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వంటివారు రేవంత్అభ్యర్థిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

బీసీలకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని , అలా కుదరని పక్షంలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి కి ఆ పదవి అప్పగించినా అభ్యంతరం లేదంటూ బహిరంగంగానే మాట్లాడుతున్నారు.పిసిసి అధ్యక్షుడు నియమించే విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతల అభిప్రాయాలను అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కు లేఖ రాశారు.2014 నుంచి ఇప్పటి వరకు పార్టీ అంతర్గత సమీక్ష జరగలేదని, అసలు ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ ఎందుకు ఓడిపోతుంది అనే విషయంపై మేధోమథనం జరగాలని విహెచ్ లేఖలో పేర్కొన్నారు.కేరళలో పార్టీ ఓటమి చెందగానే పిసిసి అధ్యక్షుడిని మార్చేశారని, కానీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదన్నారు.
అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది అంటూ విహెచ్ సూచిస్తున్నారు.అయితే ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.దీనిపై మరికొంత కాలం కాంగ్రెస్ లో రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.