ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం ఏళ్లుగా పోరాడుతోన్న వేర్పాటువాదులు ఇటీవల దూకుడు పెంచారు.సిక్కు వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ ఇటీవల కెనడాలో రెఫరెండం నిర్వహించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
కొంతకాలం మౌనంగా వున్న ఖలిస్తానీ గ్రూపులు.భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ఆందోళన సమయంలో యాక్టీవ్ అయ్యారు.
రైతుల ఆందోళన ముసుగులో ఖలీస్తానీ వేర్పాటు వాదులు దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారంటూ నిఘా వర్గాలు సంచలన నివేదికను బయటపెట్టాయి.అంతేకాదు ఎర్రకోట , ఢిల్లీలోని కీలక ప్రదేశాల వద్ద విధ్వంసం సృష్టించిన వారికి ఖలిస్తానీ గ్రూపులు భారీగా బహుమతులను ఎర వేసినట్లుగా తేలింది.
తాజాగా కెనడాలో దీపావళి వేడుకలను ఖలిస్తానీ మద్ధతుదారులు టార్గెట్‌గా చేసుకున్నారు.ఈ సందర్భంగా ఇండో కెనడియన్లకు- ఖలిస్తాన్ సానుభూతిపరులకు ఘర్షణ చోటు చేసుకుంది.బందీ చోర్ దివాస్ సందర్భంగా ఖలిస్తాన్ మద్ధతుదారులు బ్రాంప్టన్, మిస్సిస్సాగా తదితర నగరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.ఖలిస్తాన్ జెండాలను ఊపుతూ నినాదాలు చేశారు.
మాల్టన్‌లోని ఓ పార్కింగ్ లాట్‌లో 400 నుంచి 500 మంది ఘర్షణకు దిగినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక్కడికి సమీపంలో నివసించే భారతీయులకు విషయం తెలియడంతో వారంతా తమ తమ వాహనాల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు.ఇదే సమయంలో కారులోని ఓ భారతీయుడి చేతిలోని తిరంగా జెండాను లాక్కొన్న అల్లరి మూక .దానిని కిందపడేసి తొక్కారు.ఖలిస్తాన్‌కు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.వీరికి పోటీగా ఇండో కెనడియన్లు హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.