యాదాద్రి భువనగిరి జిల్లా: రేచర్ల పద్మనాయకుల పాలనలో ఘనతకెక్కిన రాచకొండ ప్రాంతం రాష్ట్ర రాజధానికి కూత వేటు దూరంలోనే ఉన్నా నేటికీ అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.గత పాలకులు పదేళ్లుగా రాచకొండ అభివృద్ధి చేస్తామని,ఫిల్మ్ సిటిగా మారుస్తామని స్వయంగా నాటి ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ ఇచ్చినా కేవలం సూచిక బోర్డులకే పరిమితమైందని ఈ ప్రాంత ప్రజల వాపోతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా,సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ ప్రాంతంలో చారిత్రక కట్టడాలైన పురాతన గుళ్లు,గోపురాలు పాలకుల నిర్లక్ష్యంతో శిధిలావస్థకు చేరుకున్నాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక అధికారం చేపట్టిన కేసీఆర్ ఈ ప్రాంతానికి విచ్చేసి రాచకొండ ప్రాంతాన్ని పర్యటించి అభివృద్ధి చేసి ఫిల్మ్ సిటీగా మార్చి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి,అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పారు.
కానీ,కేసీఆర్ ఇచ్చిన హామీ పదేళ్ళు అయినా కలగానే మిగిలిపోయింది.కేవలం రోడ్డు మార్గాన వెళ్లే రహదారుల వెంట సూచిక బోర్డులు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని,ఎలా ఉన్నవి అలాగే ఉన్నాయని గిరిజనులు,ప్రజలు,పర్యాటకులు ఆరోపిస్తున్నారు.
రాచకొండ అభివృద్ధి కోసం, రహస్య ప్రదేశాల్లో కనిపించకుండా ఉన్న కట్టడాలను వెలికితీసి బయటి ప్రపంచానికి చూపాలనే ఉద్దేశ్యంతో స్థానికులు రాచకొండ రాజప్ప కమిటీ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.
కానీ, ప్రభుత్వాలు మాత్రం వారు చేస్తున్న పనిని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం,రాష్ట్ర రెండవ సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఇప్పటికైనా రాచకొండ అభివృద్ధి జరుగుతుందా? లేదా అని ఈ ప్రాంత ప్రజల ఎదురు చూస్తున్నారు.రాచకొండను పిల్మ్ సిటీగా మార్చి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత ప్రజలతో పాటు హైదరాబాద్ నగర వాసులకు కూడా మేలు జరుగుతుందని ఈ ప్రాంత గిరిజనులు,ప్రజలు,రాజప్ప సమితి సభ్యులు కోరుతున్నారు.