సిక్కులు( Sikhs ) తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.
తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.
విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.
అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో సిక్కులపై విద్వేష నేరాలు ఎక్కువవుతున్నాయి.ఇటీవలి కాలంలో పలు సంస్థలు విడుదల చేసిన నివేదికల్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలో యూదుల తర్వాత అత్యధికంగా విద్వేష నేరాలకు గురయ్యేది సిక్కులేనట.
ఈ పరిణామాలపై నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ ( Satnam singh chaha )ఆందోళన వ్యక్తం చేశారు.జూన్ 30న యూఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్‌కు ఆయన లేఖ రాశారు.అమెరికాలో సిక్కులపై జరుగుతున్న ద్వేషపూరిత నేరాలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చాహల్ ఆ లేఖలో కోరారు.
అమెరికా(America ) అభివృద్ధి, వైవిధ్యం, సాంస్కృతిక వికాసంలో సిక్కు సమాజం కీలకపాత్ర పోషించిందని చాహల్ చెప్పారు.అయినప్పటికీ సిక్కులు వివక్ష, పక్షపాతం, హింసాత్మక చర్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మైనారిటీలపై ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టాలను బలోపేతం చేయడం, నిపుణులతో చర్చలు చేపట్టాలని చాహల్ కోరారు. సిక్కు మత విశ్వాసాలను తప్పుగా అర్ధం చేసుకోవడం, వారి వేషధారణ, తలపాగా, గడ్డం వంటి వాటితో సిక్కులపై హేట్ క్రైమ్స్ పెరుగుతున్నాయన్నారు.
పలు ఘటనల్లో అమాయకులైన సిక్కులు ప్రాణాలు కోల్పోయారని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) వెల్లడించిన గణాంకాల ప్రకారం.2021లో మతానికి సంబంధించి 1005 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి.అయితే అత్యధికంగా లక్ష్యంగా చేసుకున్న మత సమూహాల్లో ఒకరిగా సిక్కులు నిలిచారు.2018లో ఎఫ్‌బీఐకి అందిన ఫిర్యాదుల్లో సిక్కులపై జరిగిన ద్వేషపూరిత నేరాలు 60 కాగా.2020లో ఈ సంఖ్య 89కి పెరిగింది.2021లో అత్యధికంగా 214కు చేరడం సమస్య తీవ్రతగా అద్ధం పడుతోంది.విద్వేష నేరాలకు సంబంధించి 2018లో అమెరికాలో యూదులు, ముస్లింల తర్వాత సిక్కులు వుండేవారు.అయితే ఇప్పుడు అనూహ్యంగా సిక్కులు రెండవ స్థానంలోకి చేరారు.ఎఫ్‌బీఐ ప్రకారం.అమెరికాలో ఇతర మతాలకు వ్యతిరేకంగా 91 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి.
ఇందులో హిందువులపై 12, బౌద్ధులపై 10 నేరాలు జరిగాయి.