సూర్యాపేట జిల్లా: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు తీవ్రంగా విమర్శించారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు పరిచిందని,అర్థం లేని ఆంక్షలతో వేధిస్తున్నారని, స్వాతంత్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా నేటికీ ప్రజల కనీస అవసరాలైన విద్య,వైద్యం, ఆహారం,బట్ట, వ్యవసాయం,ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని,ఇంకా చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేస్తే ఊరుకోమని హెచ్చరించారు.సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకు రూ.600 ఇవ్వాలని,50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కూలీలకు నెలకు రూ.5000 రూపాయల పెన్షన్ అందించాలని మున్సిపాలిటీలోనూ, మరియు కార్పొరేషన్లలో కూడా స్లమ్ ఏరియాల్లో ఉపాధి హామీ పనులను నిర్వహించాలని,ఇండ్లు లేని వ్యవసాయ కార్మికులకు ఇల్లు కట్టించి ఇవ్వాలని,ఉపాధి హామీ పథకంలో పని చేసే కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జడ వెంకన్న సుల్తాన్ వెంకటేశ్వర్లు,తాళ్ల తిరపయ్య,బెజవాడ శ్రీనివాస్,మాతంగి సైదులు తదితరులు పాల్గొన్నారు.